తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తక్షణం జాతీయ నేతగా ఒక వెలుగు వెలగాలని అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులు పట్టించుకోవడం మానేసినా.. తన పార్టీనే జాతీయ స్థాయికి విస్తరించేస్తా అన్నట్టుగా ఆయన దూకుడు అప్రతిహతంగా సాగుతోంది.
జాతీయ నేతగా వర్ధిల్లడం అంటే బుద్ధులు కూడా జాతీయ స్థాయిలోనే ఉండాలి. ఇరుగు పొరుగు పొడకూడా గిట్టకుండా.. వ్యవహరించే ఆయన జాతీయనేతగా ఎలా తన అస్తిత్వాన్ని పదిలంగా కాపాడుకుంటారు? అనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో వ్యక్తమవుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత పంచాయతీలు ఇప్పటిదాకా తెగలేదు. ఎక్కడికక్కడ ఆస్తుల పంపకం గొడవలు, ఇంకా అనేకానేక తొమ్మిదో షెడ్యూలు వ్యవహారాలు అన్నీ పెండింగులోనే ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పొరుగు రాష్ట్రంతో సంబంధాల విషయంలో ఒక మెట్టు దిగి రాజీపడడంతో, ఇతర ఆస్తుల తగాదాలు, పంపకాలు అన్నీ పక్కన పెట్టి.. హైదరాబాదులో ఉన్న వాటిని వరకు పంచుకున్నారు. సెక్రటేరియేట్ లో పదేళ్లపాటు తాము అనుభవించడానికి ఉన్న హక్కులన్నిటినీ ఏపీ సర్కారు వదులుకోబట్టి.. ఇవాళ కేసీఆర్ సర్కారు కళ్లు చెదిరే సరికొత్త సెక్రటేరియేట్ ను నిర్మించుకోగలిగింది.
అయితే ఢిల్లీ ఆస్తుల పంచాయతీ ఇంకా తెగలేదు. తాజాగా ఏపీ-తెలంగాణ అధికారులు హోంశాఖ వారి సమక్షంలో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఏపీ భవన్ సహా ఢిల్లీలో ఉన్న ఇతర ఆస్తులను పంచుకునే విషయంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఏపీ భవన్ లో రెండు భాగాలుగా విభజించుకుని ఒకటి ఏపీ భవన్ గాను, మరొకటి తెలంగాణ భవన్ గాను ఇరు రాష్ట్రాల వారు వాడుకుంటున్నారు.
అయితే ఇవాళ్టి చర్చల సందర్భంగా తెలంగాణ అధికారులు, ఏపీ వారి ముందు ఉంచిన ప్రతిపాదనలు చాలా చిత్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ భవన్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా తమ రాష్ట్రానికే వదిలేయాలని వారు ప్రతిపాదిస్తున్నారు. దానికి ప్రతిగా పటౌడీ హౌస్ లో ఉన్న ఏడెకరాల స్థలం ఇస్తారట. అక్కడ ఏపీ ఒక సరికొత్త భవనం కట్టుకోవాలట.
రెండు రాష్ట్రాల భవనాలు పూర్తిగా వేరు వేరు చోట్ల ఉండాలని తమ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు వారు ప్రతిపాదించారట. ఈ మాట వింటే ఆశ్చర్యం కలుగుతోంది. తమ తెలంగాణ భవన్ కు పొరుగున ఏపీ భవన్ ఉండడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారా? అనిపిస్తుంది.
ఇలాంటి బుద్ధులతో ఆయన జాతీయ పార్టీగా అందరినీ ఎలా సమానంగా చూడగలరని కూడా అనిపిస్తుంది. ఆయన కలగంటున్నట్టుగా ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఇక్కడినుంచి వేరే చోటకు తరలించాలని అంటారేమో అనిపించేలా వారి వాదనలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.