గత లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ, దాని మిత్రపక్షాలు సీట్ల విషయంలో బాగా లాభపడ్డాయి. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కమలం పార్టీకి అలా కలసి వచ్చింది. అందుకు ఉదాహరణగా ప్రధానంగా రెండు రాష్ట్రాలను పేర్కొనవచ్చు. అవే బిహార్, మహారాష్ట్ర.
ఈ రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ కూటమి స్వీప్ చేసింది. ఎంపీ సీట్ల విషయంలో భారీ విజయాలను నమోదు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రధాన మిత్రపక్షాలున్నాయి అప్పట్లో. మహారాష్ట్రలో శివసేన- బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలూ కలిసి సాధించిన ఎంపీ సీట్ల సంఖ్య అక్షరాలా 41. మొత్తం 48 సీట్లకు గానూ ఇలా కాషాయ కూటమి మెజారిటీ సీట్లను సాధించింది. ఏడు సీట్లను మాత్రమే ప్రత్యర్థులకు వదిలాయి ఈ రెండు పార్టీలూ కలిసి.
ఇక బిహార్ విషయానికి వస్తే.. ఎన్డీయే రూపంలో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీలు స్వీప్ చేశాయి. 40కి గానూ 39 సీట్లను ఈ పార్టీలు సాధించాయి. ఆర్జేడీ కనీసం లోక్ సభలో స్థానం సంపాదించలేకపోగా, కాంగ్రెస్ ఒక్క సీట్లో విజయం సాధించింది బిహార్ లో.
మరి వచ్చే ఏడాది లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఇక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోవడం గమనార్హం. బిహార్ లో నితీష్ కుమార్ పార్టీతో బీజేపీకి చెడింది. అలాగే ఎల్జేపీ రూపురేఖలు మారిపోయాయి. పాశ్వాన్ తనయుడికి వ్యతిరేక తిరుగుబాటుకు బీజేపీ అండగా నిలిచింది. మరి ఈ తిరుగుబాటు గ్రూపు కు ప్రజాదరణ రేపు ఎలా ఉంటుందనేది ఒక సందేహం అయితే, నితీష్ కూడా వెంట లేకుండా బీజేపీ సోలోగా ఎంత సత్తా చూపుతుందనేది మరో సందేహం.
బిహార్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసి, బీజేపీ -ఎల్జేపీలు మరోవైపు పోటీ చేసినా.. కనీసం సగం స్థానాల్లో బీజేపీకి పోటీకి ముందే ఎదురుదెబ్బ తగిలినట్టే విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీయే కూటమి రూపంలో అప్పుడు బిహార్ లో బీజేపీకి 39 ఎంపీలు లభిస్తే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గాలి బాగా వీచినా 20 ఎంపీ సీట్లకు ఆ పార్టీ పరిమితం కావొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ఇక మహారాష్ట్రలో శివసేనతో కలిసి గత ఎన్నికల్లో స్వీప్ చేసింది కమలం పార్టీ. ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రేను కమలం పార్టీ దాదాపు భ్రష్టు పట్టించింది. మరి షిండేను అయినా సరిగా చూసుకుంటోందా అంటే, ఆయన అలిగి సొంతూరికి వెళ్లిపోయారట. ముఖ్యమంత్రి మూడు రోజులుగా విధుల్లో లేరని, ఆయన అలిగి ఊరు వెళ్లిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఇలా షిండేతోనూ కమలం పార్టీ ఆటాడుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. మరి కమలం పార్టీ మిత్రబేధంతో వచ్చే ఎన్నికల్లో బిహార్, మహారాష్ట్రల్లో భారీగానే సీట్లను నష్టపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయిప్పుడు.