మౌనం వీడుతున్నానంటున్న‌ అవినాష్‌!

వివేకా హ‌త్య‌పై వైఎస్ ష‌ర్మిల ఘాటు వ్యాఖ్య‌ల ఎఫెక్టో, మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు …కానీ ఇక‌పై మౌనంగా ఉండ‌న‌ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తేల్చి చెప్పడం గ‌మ‌నార్హం. తాజాగా ఇవాళ ఆయ‌న వివేకా…

వివేకా హ‌త్య‌పై వైఎస్ ష‌ర్మిల ఘాటు వ్యాఖ్య‌ల ఎఫెక్టో, మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు …కానీ ఇక‌పై మౌనంగా ఉండ‌న‌ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తేల్చి చెప్పడం గ‌మ‌నార్హం. తాజాగా ఇవాళ ఆయ‌న వివేకా హ‌త్య‌కు సంబంధించి ఆ రోజు ఏం జ‌రిగిందో పూస‌గుచ్చిన‌ట్టు చెబుతూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. త‌న నిర్దోషిత్వాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు.

సీబీఐ విచార‌ణ తీరుపై ప్ర‌జ‌లంద‌రికీ వాస్త‌వాలు తెలియ‌జేసేందుకంటూ క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి  వివ‌రాలు వెల్ల‌డించారు. త‌న‌తో పాటు త‌న తండ్రిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన వివేకా, ఆయ‌న కూతురు, అల్లుడిపై కొన్ని విష‌యాలు మాట్లాడ‌కుండా ఇంత‌కాలం మౌనంగా ఉన్న‌ట్టు చెప్పారు. సీబీఐ విచార‌ణ‌కు రెండుసార్లు వెళ్లిన త‌ర్వాత‌, వాళ్లు త‌ప్పుదారిలో వెళుతున్నార‌ని అర్థ‌మ‌య్యాక ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌కు తెలిసిన వాస్త‌వాలు చెప్పేందుకు వీడియో చేస్తున్న‌ట్టు అవినాష్‌రెడ్డి చెప్పారు. ఇక‌పై ఈ విష‌యం గురించి పూర్తిస్థాయిలో మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అవినాష్‌రెడ్డి వెల్ల‌డించారు.

ఒక కేసులో అప్రూవ‌ర్‌గా మార్చుకునే విధానం గురించి మీరంద‌రూ (ప్ర‌జ‌లు) ఆలోచించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రంగ‌న్న అనే వాచ్‌మ‌న్ కోర్టులో ప్ర‌త్య‌క్ష సాక్షిగా స్టేట్‌మెంట్ ఇచ్చాడ‌న్నారు. ఆ న‌లుగురు వివేకాను చంప‌డం క‌ళ్లారా చూశాన‌ని రంగ‌న్న స్టేట్‌మెంట్ ఇచ్చాడ‌ని చెప్పుకొచ్చారు. రంగ‌న్న స్టేట్‌మెంట్ ఇచ్చిన త‌ర్వాత ఆ న‌లుగురిలో ఒక‌రిని అప్రూవ‌ర్‌గా మార్చాల్సిన అవ‌స‌రం ఉందా? లేదా? అనేది మొద‌ట ఆలోచించాల‌ని ప్ర‌జానీకానికి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఆ అప్రూవ‌ర్ పూర్వాప‌రాలు కూడా ఆలోచించాల‌న్నారు. అత‌ను కిరాయి హంత‌కుడ‌న్నారు. డ‌బ్బు కోసం మ‌నిషిని చంపే హంత‌కుడు, వ్యక్తిత్వ హ‌ననానికి పాల్ప‌డ‌డ‌నే గ్యారెంటీ ఏంటి? అని అవినాష్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఇలాంటి వ్య‌క్తిని అప్రూవ‌ర్‌గా మార్చ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అని ప్ర‌శ్నించారు.

సీబీఐ, మ‌రీ ముఖ్యంగా మా అక్క సునీత‌, రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి గురించి కూడా మీకు చెప్పాలన్నారు. వివేకా మరణించినట్లు శివప్రకాశ్‌రెడ్డి తనకు చెప్పారన్నారు. తాను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నానన్నారు. పులివెందుల రింగ్‌రోడ్డు దగ్గరున్నప్పుడు కాల్‌ వచ్చిందన్నారు. వివేకా ఇంటికెళ్లి ఘ‌ట‌నా స్థ‌లంలో ర‌క్తం బాగా ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యాన్ని సీఐకి ఫోన్ చేసి చెప్పాన‌న్నారు. అలాగే ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నాయా అని పీఏ కృష్ణారెడ్డిని అడిగానన్నారు. తాను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను దాచారన్నారు. ఇదంతా వివేకా అల్లుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆదేశాల మేర‌కే జ‌రిగింద‌న్నారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వివేకా రాసిన చివ‌రి రాత‌ల్లో వుంద‌న్నారు.

వివేకా హత్య కేసులో ఆయ‌న రాసిన లేఖ‌ కీలకమని ఆయ‌న‌ తెలిపారు. అలాంటి లేఖను ఎందుకు దాచారని అడిగితే.. రాజశేఖర్‌రెడ్డి చెప్పిన సమాధానం హాస్యాస్పదమన్నారు. డ్రైవర్ ప్రసాద్ మంచోడని వెన‌కేసుకొచ్చార‌న్నారు. డ్రైవ‌ర్ గురించి వివేకా రాశార‌ని తెలిస్తే అత‌నిపై  దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్‌రెడ్డి తనకు చెప్పారని అవినాష్‌ రెడ్డి వెల్లడించారు. తండ్రి కంటే డ్రైవ‌ర్ ప్ర‌సాద్‌నే న‌మ్ముతారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ లెటర్‌పై సీబీఐ ఎందుకు ఫోకస్‌ చేయడం లేదో అర్ధం కావడం లేదన్నారు. ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

సీబీఐ విచార‌ణాధికారి రాంసింగ్‌లో ఏదో తేడా వుంద‌న్నారు. ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాల‌నే ఉద్దేశంతోనే వాస్త‌వాలు వెల్ల‌డిస్తున్న‌ట్టు అవినాష్‌రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు నిన్న వైఎస్ ష‌ర్మిల త‌న చిన్నాన్న‌ను ఆస్తుల కోసం హ‌త్య చేయ‌లేద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల‌కు కౌంట‌ర్ అని చెప్ప‌లేదు కానీ, వాస్త‌వాల పేరుతో అవినాష్‌రెడ్డి త‌న‌కు తెలిసిన అంశాల్ని ప్ర‌జ‌ల ముందు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.