బీజేపీపై పోరాటానికి.. తెరాసకు కలిసొచ్చింది!

అసలే తెలంగాణ రాష్ట్ర సమితి. భారతీయ జనతా పార్టీపై కొంతకాలంగా తీవ్రస్థాయిలో నిప్పులు కక్కుతూ ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వారి చేతికి మరో అద్భుతమైన అస్త్రాన్ని అందించారు. ఇలాంటి అవకాశాన్ని వారు…

అసలే తెలంగాణ రాష్ట్ర సమితి. భారతీయ జనతా పార్టీపై కొంతకాలంగా తీవ్రస్థాయిలో నిప్పులు కక్కుతూ ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వారి చేతికి మరో అద్భుతమైన అస్త్రాన్ని అందించారు. ఇలాంటి అవకాశాన్ని వారు వృథా చేసుకుంటారా? అందుకే.. తెరాస ఫుల్ గేర్ లో ఎడ్వాంటేజీ తీసుకుంటోంది. 

రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలనుంచి ఆయనను పూర్తిస్థాయిలో ఇరుకునపెట్టడానికి, తద్వారా తెలంగాణలో బీజేపీ మీద ప్రజల్లో అసహ్యభావం కలుగ జేయడానికి తమవంతు పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణను అవమానించారంటూ.. టీఆర్ఎస్ కీలక నాయకులు, మంత్రులు అందరూ పెద్దస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బీజేపీ నేతలను తూర్పారపడుతున్నారు. మోడీ విషం కక్కుతున్నారని అంటున్నారు. 

ఇంతకీ మోడీ రాజ్యసభలో ఏం అన్నారు? రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని తిట్టడం అనేది మోడీ ఎజెండా? కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి, దేశంలో ప్రతి రాష్ట్రానికీ ద్రోహం చేసిందని ప్రతి రాష్ట్రాన్నీ ప్రస్తావిస్తూ ఏదో ఒక ద్రోహాన్ని గుర్తు చేయడం ఆయన ప్రసంగంలోని స్కెచ్! అందులో భాగంగానే కర్నాటకలో ఎలా వీరేంద్రపాటిల్ ను తొలగించారో, తమిళనాడులో ఎలా ఎంజీఆర్, కరుణానిధి ప్రభుత్వాలను తొలగించారో, ఏపీలో ఎలా అంజయ్యను (ఇప్పటి తెలంగాణ) అవమానించారో, ఎన్టీఆర్ (ఇప్పటి ఏపీ)ను ఎలా పదవీచ్యుతుడిని చేశారో.. ఇదే తరహాలో ఉత్తరాది రాష్ట్రాల ఉదాహరణలను అన్నిటినీ ఆయన గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని దునుమాడడానికి ప్రసంగం సిద్ధం చేసుకున్నారు. 

అయితే అక్కడితో పరిమితం అయి ఉంటే బాగుండేది. ఏపీ విషయం వచ్చేసరికి ఆయనకు పూనకం వచ్చినట్లుంది. అందుకే రెచ్చిపోయి విభజన ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, చిన్న రాష్ట్రాలకు తామే మద్దతిచ్చామని అంటూనే.. కాంగ్రెస్ విభజించిన తీరు సరిగా లేదని ఆయన వాక్రుచ్చారు. పార్లమెంటులో మైకులు కట్ చేయడం, పెప్పర్ స్ప్రే గొడవ ఇవన్నీ ప్రస్తావించారు. 

విభజన నాడు సభలో ఏం జరిగింది అనే ప్రస్తావన ఎప్పుడు ఎక్కడ వచ్చినా సరే.. టీఆర్ఎస్ భగ్గుమంటూ ఉంటుంది. తెలంగాణ గురించి పాజిటివ్ గా చెప్పడానికి అయినా సరే.. ఆ ప్రస్తావననే ఇష్టపడదు.  అలాంటిది అసలే ఇప్పుడు నరేంద్రమోడీ మీద టీఆర్ఎస్ సారథి నిప్పులు చెరుగుతున్న సీజన్లో మోడీ ఆ ప్రస్తావన తేవడంతో దాన్ని పూర్తిగా ఎడ్వాంటేజీ తీసుకుంటున్నారు. 

మోడీ పదేపదే తెలంగాణను అవమానిస్తున్నారని, గుజరాత్‌ను మించి సాధిస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని నానా మాటలు అంటున్నారు. దశాబ్దాల పోరాటాన్ని కించపరుస్తున్నారని నిందలు వేస్తున్నారు. రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు చీమూనెత్తురూ ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా అంటున్నారు. 

నిజానికి మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. కానీ.. టీఆర్ఎస్ ఈ సమయంలో చేపట్టిన బీజేపీ వ్యతిరేక పోరాటం ముందు కాంగ్రెస్ ప్రకటన తేలిపోయింది. టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలకు కూడా పిలుపు ఇచ్చింది.