బీజేపీ ఉత్తరాంధ్రా రాగం

రాజకీయమంటేనే అది. ఏదో ఒక రాగం ఎత్తుకోవాలి. అలా జనాలను తిప్పుకునే ప్రయత్నం అయితే చేయాలి. బీజేపీ ఏపీ పెద్ద సోము వీర్రాజు ఇపుడు అలాంటిదే చేయబోతున్నారు. ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల సమగ్రాభివృద్ధిని కోరుతూ…

రాజకీయమంటేనే అది. ఏదో ఒక రాగం ఎత్తుకోవాలి. అలా జనాలను తిప్పుకునే ప్రయత్నం అయితే చేయాలి. బీజేపీ ఏపీ పెద్ద సోము వీర్రాజు ఇపుడు అలాంటిదే చేయబోతున్నారు. ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల సమగ్రాభివృద్ధిని కోరుతూ అయిదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఆందోళన నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాను కూడా ఈ ఆందోళనలలో పాల్గొంటాను అని ఆయన చెబుతున్నారు.

ఉత్తరాంధ్రాలో సాగు నీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ సత్వరం పూర్తి చేయాలని, మొత్తంగా మూడు జిల్లాలకు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ త్వరలో సోము వీర్రాజు ఉత్తరాంధ్రాలో బీజేపీ ఆందోళనలో పాలుపంచుకుంటారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రాలో నీటి పారుదల, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో  నిర్లక్ష్యంతో వ్యవహరించాయని ఆయన అంటున్నారు. అందువల్ల బీజేపీ వస్తేనే ఉత్తరాంధ్రా అభివృద్ధి అని కూడా చెబుతున్నారు. 

మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాల మీద  ప్రధాన పార్టీలు శీత కన్ను వేశాయని అంటున్నారు. బీజేపీ ద్వారా ఆందోళనను చేపట్టడం ద్వారా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువస్తామని సోము వీర్రాజు చెబుతున్నారు.

ఇవన్నీ సరే కానీ బాగా వెనకబడిన ఉత్తరాంధ్రా మూడు జిల్లాలకు గత నాలుగేళ్లుగా అభివృద్ధి నిధులు కేంద్రం ఇవ్వని సంగతిని కూడా ప్రశ్నించి వీర్రాజు ఈ ఆందోళనలో తమ ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలని సూచనలు వస్తున్నాయి. అంతే కాదు, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజిని ఉత్తరాంధ్రాకు కేటాయించాలని కూడా స్థానికుల నుంచి బీజేపీ సర్కార్ మీద డిమాండ్ ఉంది. దాని మీద కూడా వీర్రాజు మాట్లాడుతారా. ఏమో చూడాలి.