ఈ ప్యాపర్ లో ఈ యాడ్ వేసిన మహానుభావులెవరో?

కొన్ని సినిమాలుంటాయి. అవి నగరాల్లోనే ఆడతాయి. వాటిల్ని మల్టీప్లెక్సుల్లోనే విడుదల చేస్తారు.  Advertisement కొన్ని పట్నాల్లోనూ, పల్లెల్లోనూ ఆడతాయి. వాటిని బి, సి సెంటర్ సినిమాలంటారు. వాటి కోసం ఆ ఏరియాల్లో ఎక్కువ థియేటర్స్…

కొన్ని సినిమాలుంటాయి. అవి నగరాల్లోనే ఆడతాయి. వాటిల్ని మల్టీప్లెక్సుల్లోనే విడుదల చేస్తారు. 

కొన్ని పట్నాల్లోనూ, పల్లెల్లోనూ ఆడతాయి. వాటిని బి, సి సెంటర్ సినిమాలంటారు. వాటి కోసం ఆ ఏరియాల్లో ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తారు. 

ఇది వ్యాపారంలో ప్రాధమిక సూత్రం. వ్యాపారం అనడం కన్నా కామన్ సెన్స్ అనడం కరెక్ట్. 

ఏ విషయానికి ఎక్కడ ఆడియన్స్ ఉంటారో అక్కడే ఆ విషయం చెప్పాలి కానీ పంజాబెళ్లి బార్బరు షాపు, ఊటీలో ఏసీలమ్మే షాపు పెట్టినట్టుండకూడదు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా “జగనన్న చేదోడు” అంటూ ఒక పెద్ద యాడ్ వదిలారు దినపత్రికల్లో. అవి కూడా 'ది హిందూ', 'డెక్కన్ క్రానికల్” లో. 

అసలీ ప్యాపర్లు చదివేదెవరు? అధికస్థాయిలో నగరాల్లో ఉండే విద్యావంతులే. వాళ్లకి, ఆ యాడ్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? 

నిరుపేదలైన నాయీబ్రాహ్మలకి, రజకులకి, దర్జీలకి ఏడాదికి రూ 10000 ఇచ్చే స్కీము ఈ “జగనన్న చేదోడు”. 

అసలే నగరాల్లో స్థిరపడిన విద్యావంతులు చాలామంది ప్రజాధనాన్ని స్కీముల రూపంలో పంచిపెడుతున్నందుకు జగన్ ప్రభుత్వంపై కడుపుమంటతో ఉన్నారు. వాళ్ల ముందు ఈ బాకా ఊదడమెందుకు?.. పుండు మీద కారం లాగ!! 

అసలీ యాడ్ కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఊళ్లల్లో ఉండే ఆయా వర్గాల వాళ్లు. లబ్ధిదారుల ముందు “ఇలా పంచుతున్నాము మీకు” అని చెప్పుకోవడంలో తప్పు లేదు. 

అక్కర్లేని వాళ్లకి చెప్పడం వల్ల మాత్రం సీన్ రివర్సవ్వొచ్చు. 

ప్యాపర్లో యాడ్సివడం తప్పదనుకుంటే ఏ ప్యాపర్లో ఏది ఇవ్వాలో ఆలోచించుకుని ఇవ్వాలి. 

ఇంగ్లీష్ ప్యాపర్లలో అభివృద్ధి పనులకి సంబంధించిన యాడ్స్ ఇచ్చుకోవచ్చు. 

ఉదాహరణకి “నాడు నేడు” పేరుతో వేసిన రోడ్స్ గురించి, తీర్చి దిద్దిన ప్రభుత్వ పాఠశాలల గురించి, హాస్పిటల్స్ గురించి, కొత్తగా పెడుతున్న మెడికల్ కాలేజీల గురించి…ఇలా ఎన్నో ఉంటాయి. 

అంతే కాదు తాజాగా ఉద్యోగులకి పీఆర్సీ విషయంలో పరిష్కారం లభించి, చర్చలు ఫలించి ఉద్యమం విరమించారు కదా..ఆ విషయం మీద ఘనంగా ప్యాపర్ యాడ్ వేసుకోవచ్చు ఇవే ఆంగ్ల పత్రికల్లో. 

అసలు ఈ మాత్రం ప్రాధమిక స్థాయి ఆలోచన చేసే వారు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేరా? అంతలేసి జీతాలిస్తూ సలహాదారులెందుకున్నట్టు? 

ఇలాంటి యాడ్సే ట్రోలింగులకి గురౌతుంటాయి. 

అదంతా పక్కన పెడితే ఈ రోజుల్లో అసలు ప్యాపర్లో యాడ్స్ చూసేవాళ్లెంతమంది? డిజిటల్లో చూసేవాళ్లెంతమంది? 

దీనికి పెద్ద గణాంకాలేవీ తీయక్కర్లేదు. కళ్లు తెరిచి చూస్తే చాలు డిజిటల్ విప్లవం ప్యాపర్ని ఎంతెలా మింగేసిందో తెలుస్తుంది. 

రూ 200 కోట్ల విలువైన “జగనన్న చేదోడు” స్కీము గురించి సుమారు రూ 10 కోట్లు ఖర్చుపెట్టి ప్యాపర్లో యాడ్స్ ఇవ్వడం తప్పు కాదు కానీ చేరాల్సిన వారిని చేరక, చేరకూడని వారిని చేరి ఎంత వృధా అయిందో ఏలుతున్నవారు ఆలోచించాలి. 

ఇది చిన్న విషయం కాదు. ప్రజాధనానికి, ప్రభుత్వం ఇమేజుకి సంబంధించిన విషయం. ఇకనైనా యంత్రాంగంలో ఉన్న అందరూ మెదళ్లు వాడతారని ఒక ఆకాంక్ష. 

శ్రీనివాసమూర్తి