వీరివెనుక ఖచ్చితంగా రాజకీయం! ఎలాగంటే..

పీఆర్సీ వ్యవహారం ముగిసిపోయింది. ఉద్యోగులకు ఎంతగా అయినా ఆశపడి ఉండొచ్చ గానీ.. ఇచ్చిన దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పుకున్న వివరణలతో వారు సంతృప్తి చెందారు. ఉద్యమాలను విరమించుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ సంఘాల…

పీఆర్సీ వ్యవహారం ముగిసిపోయింది. ఉద్యోగులకు ఎంతగా అయినా ఆశపడి ఉండొచ్చ గానీ.. ఇచ్చిన దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పుకున్న వివరణలతో వారు సంతృప్తి చెందారు. ఉద్యమాలను విరమించుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొత్తమాటలు వినిపిస్తున్నాయి. 

కొత్త పోరాటం సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా పెన్షనర్ల వాదన పేరిట మరో వ్యవహారం కూడా జగన్ పై బురద చల్లడానికి రెడీ అయింది. అయితే ఈ వ్యవహారాలను గమనించినప్పుడు మాత్రం.. ఖచ్చితంగా వీరి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని, రాజకీయ ప్రేరేపితంగానే.. పీఆర్సీ ఎపిసోడ్ ముగిసిపోయిన తర్వాత కూడా.. అందులో అగ్గిరాజేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి వీరు ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది. ఎలాగంటే..

ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా వామపక్ష పార్టీల చేతుల్లో ఉన్నాయి. ఉన్నంత మాత్రాన ఉపాధ్యాయులందరూ కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేసేవాళ్లేమీ కాదు. అలాగని.. మీ జీతాలు పెంచడానికి ఉపయోగపడతాం అని వామపక్ష నేతలు పురికొల్పితే ఆశపడకుండా ఉండరు. ఇప్పుడు ఆ ఉపాధ్యాయ సంఘాలే కొత్త ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నాయి. తమ సత్తా ఏమిటో చూపిస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ముందు ఎర్రజెండా.. వెనుక పచ్చజెండా అంటూ వామపక్ష పార్టీలు నడిపిస్తున్న ఉద్యమాల వెనుక చంద్రబాబు ప్రేరేపణ కుట్ర ఉన్నదని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను కేవలం రాజకీయం అని  కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు. ఇలాంటి కుట్రలను తెరవెనుకనుంచి నడిపించడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడు నిపుణుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. 

ఇదే సమయంలో ఇప్పుడు పెన్షనర్లు కూడా గొడవ చేస్తున్నట్లుగా కొత్త సంగతి తెరమీదకు వస్తోంది. పెన్షనర్లకు పెన్షన్లలో కోత పెట్టడం జరగలేదు. వయస్సు పెరిగే కొద్దీ అదనంగా లభించే క్వాంటం పెన్షన్‌లో మాత్రమే మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు పెన్షనర్లందరూ ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కుట్రకు వంత పాడుతున్నట్లుగా ఇలాంటి లేని ఆందోళనల్ని ప్రచారంలో పెట్టి అందరినీ రెచ్చగొట్టడానికి పచ్చమీడియా సిద్ధంగా ఉండనే ఉంటుంది. 

పచ్చమీడియాకు చెందిన అగ్రదినపత్రికలో ఒక వార్త వచ్చింది. పెన్షనర్ల సంఘాలు కోర్టుకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నాయట. సంఘాలుగా వెళ్లకపోతే.. బృందాలుగా గానీ, వ్యక్తిగతంగా గానీ కోర్టులో కేసులు వేస్తారట. ఇది వార్తలో సారాంశం. దీన్ని చూస్తే ఏం అనిపిస్తున్నదంటే.. వ్యక్తులతో కేసులు ఖచ్చితంగా కోర్టుకు వెళతాయి. 

ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్రంలో ఏదో ఒక మూల నుంచి ఎవరో ఒకరి పేరుతో కోర్టులోకేసులు వేయించడం.. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడడం చంద్రబాబకు వెన్నతో పెట్టిన విద్య అనే సంగతి అందరికీ తెలుసు. 

ఇప్పుడు పెన్షనర్ల ద్వారా కూడా చంద్రబాబు అదే పని చేయబోతున్నాడని, దానికి ముందునుంచే పచ్చమీడియా రంగం సిద్ధం చేస్తున్నదని అర్థమవుతోంది. ఇలాంటి వార్తలను ప్రచురించడం ద్వారా లేని ఆలోచనను పురిగొల్పి.. పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయాలని రెచ్చగొట్టేలా వ్యవహారం కనిపిస్తోంది.

ఒక ప్రణాళిక ప్రకారం ఇంత కుట్ర జరుగుతోంటే.. ఈ వ్యవహారాల వెనుక రాజకీయ కుట్రలు లేవని అనుకోవడం ఎలాగ? అందుకే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నిజం అనే అనిపిస్తోంది.