ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్ ఇది. కొరటాల శివ దర్శకత్వంలో అతడు దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా 2 భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రకటించాడు.
“దేవర సినిమా కథ రాసుకున్నప్పుడు, ఎన్టీఆర్ కు నెరేట్ చేసుకున్నప్పుడు అందరం ఓ హై ఫీల్ అయ్యాం. బిగ్ కాన్వాస్, భారీ తారాగణంతో ఉన్న సినిమా ఇది. అలా ఎంతో ఉత్సాహంతో షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, మేం సృష్టిస్తున్న ప్రపంచం మరింత పెద్దగా కనిపిస్తోంది. ఆ పాత్రలతో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఆ ప్రపంచం చాలా అద్భుతంగా ఉంది. 2-3 షెడ్యూల్స్ అయిన తర్వాత అందరం చూసుకున్నప్పుడు డబుల్ హై ఫీల్ అయ్యాం. కాకపోతే మా అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే.. ఎడిటింగ్ లో ఏ ఒక్క సీన్ ను, డైలాగ్ ను తీయలేం కదా అనిపించింది. సింగిల్ పార్ట్ లో ఈ కథను ముగించేయాలని అనుకోవడం తప్పు అనిపించింది. 2 భాగాలుగా చెప్పడం కరెక్ట్ అనిపించింది. ప్రతి పాత్రను డీటెయిల్డ్ గా చెప్పాలని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రెండు భాగాలుగా దేవరను చెప్పాలనుకుంటున్నాం.”
ఇలా దేవర రెండు భాగాలుగా రాబోతోందనే విషయాన్ని కొరటాల ప్రకటించాడు. భారతదేశ తీర ప్రాంతంలో చాలా బలమైన పాత్రల మధ్య ఈ కథను 2 భాగాలుగా చెప్పబోతున్నామని.. సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తామని అంటున్నాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర పార్ట్-1 రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.