ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా.. పవన్‌తో కళ్యాణం రాజకీయంగా టీడీపీ చావుకొచ్చిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్‌కల్యాణ్, కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. రాజకీయాల్లో పవన్ పిల్ల చేష్టలు చేస్తున్నారని, అతనితో ఆడిస్తున్న టీడీపీ అంతు చూడాలని తీవ్ర ఆగ్రహంతో బీజేపీ పెద్దలు రగిలిపోతున్నారని సమాచారం.
రాజకీయంగా పవన్‌కల్యాణ్ దిగంబరుడని, ఆయన్ను టచ్ చేయడానికి కూడా ఏమీ లేదనే అభిప్రాయంలో బీజేపీ ఉంది. అయితే తమతో జనసేన మిత్రపక్షమని తెలిసి, ఏదైనా వుంటే చెప్పి చేయాలనే కనీస మర్యాద టీడీపీ కూడా పాటించలేదనేది బీజేపీ పెద్దల ఆవేదన, ఆగ్రహం. ఏపీలో తమ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవచ్చని, అయితే ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేర్వేరు వుంటాయని, రానున్న రోజుల్లో తమ అవసరం ఏంటో టీడీపీకి రుచి చూపించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలిసింది.
టీడీపీని దెబ్బ కొట్టడం ద్వారా, పరోక్షంగా తమ పవర్ ఏంటో పవన్‌కు తెలియజేయాలని బీజేపీ భావిస్తోంది. పవన్‌కు రాజకీయాలంటే పిల్లాటగా ఉన్నట్టుందని, తనకు తానుగా నాలుగేళ్ల క్రితం కాళ్లావేళ్లా పడి పొత్తు పెట్టుకుని, ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరొక పార్టీతో రాజకీయ అవగాహన కుదుర్చుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా తామంటే అన్ని రాజకీయ పార్టీలు వణికిపోతున్న తరుణంలో, ఒక సీటు కూడా లేని పవన్ వ్యవహరించిన తీరు ముమ్మాటికీ బీజేపీని అవమానించే రీతిలో వుందనే ఫిర్యాదులు జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
పవన్ నాటకాన్ని చూస్తూ, అదును చూసి ఆయన దత్త తండ్రి చంద్రబాబుకు కర్ర కాల్చి వాత పెట్టాలనే అభిప్రాయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్టు ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. ఆంజనేయుడికి కుప్పి గంతులు నేర్పినట్టుగా, సీఎం జగన్‌ను గద్దె దింపేందుకు రోడ్ మ్యాప్ పేరుతో రాజకీయాలు నేర్పాలని చూశారని బీజేపీ పెద్దలు అంటున్నారు.
మాయల ఫకీర్ ప్రాణం చెట్టు తొర్రలోని బంగారు పంజరంలోని చిలుకలో ఉన్నట్టుగా, పవన్ ప్రాణం చంద్రబాబులో ఉందని, ఆయన కథేంటో రానున్న రోజుల్లో చూసే అవకాశం వుందని ఏపీ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. బహుశా చంద్రబాబు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా పవన్ వ్యవహార శైలి వుందని వారు అంటున్నారు.
పవన్ ఎంతగా రెచ్చిపోతే, అంతకు రెండింతలు చంద్రబాబుకు కష్టనష్టాలు తప్పవని తెలుసుకోవాలని బీజేపీ నేతలు హితవు చెబుతున్నారు. పవన్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబుకు అదనపు సమస్యలు మరో రూపంలో ఎదురు కానున్నాయి. అవేంటో రాజకీయ అజ్ఞాని అయిన పవన్‌కు ఎప్పటికీ తెలియవు. కేవలం చంద్రబాబుకు మాత్రమే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. రాజకీయం అంటే అదే మరి. తాడుబొంగరం లేని వాళ్లతో అంటకాగడం వల్ల ఒక్కోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.