ప్రధాని మోడీ తెలంగాణ వచ్చారు. బాంబు లాంటి మాటలు విసిరారు. ప్రధానిగా ఆయన మాట్లాడలేదు. ఓ పార్టీ నేతగా మాట్లాడారు. కేసీఆర్ మీద, ఆయన పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేసారు. ఇవి ఏమిటి? అన్నది పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది అనడానికి ఇవే సంకేతాలు అనుకోవచ్చేమో? ఎందుకంటే పత్రికలు ఏం రాసినా, జనాలు ఏం అనుకుంటున్నారు అన్నది కేంద్ర ఇంటిలిజెన్స్ కు పక్కా సమాచారం వుంటుంది. బహుశా అందుకే మోడీ ఇలా మాట్లాడి వుండొచ్చు.
నిజానికి మోడీ ఓ మెట్టు దిగే మాట్లాడారు. ఓ పార్టీ నేతగా ఎన్ని ఆరోపణలు అయినా చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ కొన్ని మాత్రం తగదు. ముఖ్యంగా అంతరంగిక విషయాలు. పార్టీ నేతలు.. పార్టీ నేతలు ఏవో సందర్భాల్లో కొన్ని అంతరింగిక విషయాలు షేర్ చేసుకుంటూనే వుంటాయి. కానీ తేడా వచ్చింది కదా అని వాటిని బయటపెట్టకూడదు. కానీ మోడీ అదే చేసారు.
ఎన్టీఎ లోకి వస్తామన్నారు కేసీఆర్, అలాగే కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించమన్నారు అని చెప్పారు. ఇవి నిజమే కావచ్చు. కానీ ఈ సందర్భంలో వాటిని బయట పెట్డడం ద్వారా మోడీ ఏం సాధించదలిచారు? కేసీఆర్ ను మరింత వీక్ చేయాలనుకుంటున్నారా? కానీ దాని వల్ల ఎవరికి ప్రయోజనం?
మోడీ మాటల వల్ల వచ్చే వ్యతిరేకతను అంది పుచ్చుకునే స్థితిలో తెలంగాణ భాజపా వుందా? లేదు కాక లేదు. ఒకప్పుడు తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయంగా కనిపించిన భాజపా ఇప్పుడు మూడో స్థానానికి వెళ్లిపోయింది అన్నది వాస్తవం. ఎన్ని కుమ్ములాటలు వున్నా, కాంగ్రెస్ ముందుకు సాగుతోందని క్లారిటీ కనిపిస్తోంది.
బయటకు కనిపించకున్నా తేదేపా కేడర్ అంటూ ఏదైనా తెలంగాణలో వుంటే అది రేవంత్ రెడ్డినే బలపరుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో, సెటిలర్స్ వున్న ప్రాంతాల్లో భారాస వీక్ అవుతోంది. కానీ అలా అని భాజపా బలపడడం లేదు. అందుకే జనసేనను మరీ స్పెసిఫిక్ స్ధానాల్లో రంగంలోకి దింపే వ్యూహాన్ని రచించారు.
ఇలాంటి టైమ్ లో మోడీ భారాస ను మరింత వీక్ చేద్దామని ఈ మాటలు మాట్లాడి వుండొచ్చు. కేసీఆర్ సిఎమ్ గా ఇక ఎన్నాళ్లో వుండరు అనే భావన జనాల్లోకి పంపాలని అనుకుని వుండొచ్చు. కానీ దాని వల్ల భాజపా లాభపడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు మరింత బలం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రస్తుతం అటే వుంది. మరి మోడీ ఎందుకు అలా చేసారు అన్నది ఆయనకే తెలియాలి. ఈ
విషయాలు అన్నీ ఆయన ఆలోచించలేదు, ఆయనకు తెలియదు అని అనుకోవడానికి వీలు లేదు. కానీ మోడీ స్ట్రాటజీ ఏమిటి అన్నది అంతుపట్టని పాయింట్. అంటే ఇంకా భాజపా నే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా వుందనే భావనలో మోడీ వుండి వుండాలి. అందుకే ఇలా మాట్లాడి వుంటారు అని అనుకోవాలేమో?