తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం న్యాయపోరాటానికి మహామహా లాయర్లంతా బరిలోకి దిగుతున్నారు. ఈ కేసులో ఆదిలోనే లూత్రా తెరపైకి వచ్చాడు. గంటకు కోటి రూపాయలకు పైగా తీసుకుంటారనే పేరున్న లూత్రా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలకు అధికారిక లాయర్ తరహాలో వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు.
మరి విజయవాడ ఏసీబీ కోర్టుకే లూత్రాను తీసుకొచ్చారు. ఆ తర్వాత వ్యవహారం హైకోర్టు వరకూ వచ్చాకా.. ఢిల్లీ నుంచి మరో పేరున్న లాయర్ హరీష్ సాల్వేను తెరపైకి తెచ్చారు. అక్కడకూ సాల్వే అప్పుడు ఇండియాలో లేరట. ఆయన లండన్ లో ఉండగా.. అక్కడ నుంచి వర్చువల్ గా ఆయన చేత వాదనలు వినిపించేలా చేశారు!
ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఢిల్లీ వరకూ చేరాకా.. సుప్రీం కోర్టులో మరో లాయర్ తెరపైకి వచ్చారు! ఆయనే అభిషేక్ మనుసింఘ్వీ. ఈయన పేరున్న సుప్రీం కోర్టు లాయరే కాదు, కాంగ్రెస్ పార్టీ నేత కూడా! సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ గంటకు కోట్ల రూపాయల ఫీజును తీసుకునే లాయర్లలో సింఘ్వీకి కూడా పేరుంది. కేవలం లా ప్రాక్టీస్ మాత్రమే కాకుండా… కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉంటారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్లో సింఘ్వీ ఒకరు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ తరఫు రాజ్యసభ సభ్యుడు కూడా! సోనియాగాంధీ బంటుల్లో ఒకరిగా కూడా సింఘ్వీకి పేరుంది. లాయర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కేసులను కానీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల తరఫున కానీ వాదించడనే పేరు కూడా ఉంది సింఘ్వీకి. మరి అలాంటి సింఘ్వీ కూడా ఇప్పుడు చంద్రబాబు తరఫున రంగంలోకి దిగడం గమనార్హం.
గంటకు కోటీ, కోటిన్నర తీసుకుంటారనే పేరున్న లాయర్లు.. ఒకరికి ముగ్గురు సుప్రీంలో చంద్రబాబు తరపున రంగంలోకి దిగారు. వీరుగాక ఇంకో లాయర్ కూడా ఉన్నాడట అక్కడ చంద్రబాబు తరఫున. వీరి నలుగురిని చూసి.. ఎంతమంది వాదిస్తారంటూ సుప్రీం కోర్టు జడ్జి కూడా ఆశ్చర్యపోయారంటే.. చంద్రబాబు లాయర్లు ఆ రేంజ్ లో ఉన్నారు!