బీజేపీపై లింగాయ‌త్ ల అసంతృప్తి!

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మూలాలు లింగాయ‌త్ ల మ‌ద్ద‌తు మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లో లింగాయ‌త్ ల మ‌ద్ద‌తు రాజ‌కీయంగా ఎప్పుడూ ముఖ్య‌మే. గ‌తంలో లింగాయ‌త్ లు కాంగ్రెస్ కు గ‌ట్టి మ‌ద్ద‌తుదార్లుగా…

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మూలాలు లింగాయ‌త్ ల మ‌ద్ద‌తు మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లో లింగాయ‌త్ ల మ‌ద్ద‌తు రాజ‌కీయంగా ఎప్పుడూ ముఖ్య‌మే. గ‌తంలో లింగాయ‌త్ లు కాంగ్రెస్ కు గ‌ట్టి మ‌ద్ద‌తుదార్లుగా నిలిచారు. కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి లింగాయ‌త్ నేత‌లు సీఎంల‌య్యారు. ఆ త‌ర్వాత లింగాయ‌త్ ఓట్ల‌ను స‌మీకృతం చేసుకున్న‌ది య‌డియూర‌ప్ప. అది కూడా ఆయ‌న క‌న్నీరు పెట్టుకుని రోడ్డెక్క‌డంతో సానుభూతి వ‌ర్షించింది. అలా వ‌ర్షించిన సానుభూతి క్ర‌మంగా య‌డియూర‌ప్ప‌కు అండ‌గా మారింది. 

య‌డియూర‌ప్ప వెంట లింగాయ‌త్ లు గ‌ట్టిగా నిల‌బ‌డ్డారు. అందుకు నిద‌ర్శ‌నం ఆయ‌న బీజేపీని వీడి సొంత పార్టీ పెట్టుకున్న‌ప్పుడు ఆయ‌న పార్టీకి చెప్పుకోద‌గిన స్థాయిలో ల‌భించిన ఓటు బ్యాంకు! అలా తాము బీజేపీ స‌మ‌ర్థించ‌డం క‌న్నా య‌డియూర‌ప్ప‌ను స‌మ‌ర్థిస్తున్నామ‌ని లింగాయ‌త్ లు చెప్ప‌క‌నే చెప్పారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించి భార‌తీయ జ‌న‌తా పార్టీ య‌డియూర‌ప్ప‌ను సీఎం ప‌ద‌వి నుంచి దించేశాకా కూడా అదే సామాజిక‌వ‌ర్గం వ్య‌క్తినే సీఎంను చేసింది. అయితే ఈ సారి అంత ప్ర‌భావం ఉండే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ప్ర‌త్యేకించి బొమ్మైని సీఎంగా కూర్చోబెట్టినా రిమోట్ త‌మ చేతిలోనే ఉంచుకుంది బీజేపీ అధిష్టానం. అచ్చంగా కిర‌ణ్ కుమార్ రెడ్డి రూపంలో రెడ్డిని సీఎంగా చేసి, కాంగ్రెస్ హైక‌మాండ్ అంతా త‌మ క‌నుస‌న్న‌ల్లో న‌డిపించిన‌ట్టుగా! అప్పుడు కిర‌ణ్ తో కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్ర‌యోజ‌నం పొందిందో, ఇప్పుడు బొమ్మైతో బీజేపీ అంతే ప్ర‌యోజ‌నం పొందుతుందేమో!

ఇక కాంగ్రెస్ లోనూ కొంద‌రు ప్ర‌ముఖ లింగాయ‌త్ నేత‌లున్నారు. వారు ఇదే అదునుగా విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ టికెట్ నిరాక‌రించిన వారిలో లింగాయ‌త్ నేత‌లే ఎక్కువ‌మంది ఉన్నార‌ట‌! వ్య‌తిరేక‌త ఉందంటూ బీజేపీ ప‌క్క‌న పెట్టిన సిట్టింగుల్లో ఎక్కువ‌మంది లింగాయ‌త్ లేన‌ట‌! అదే బ్ర‌హ్మ‌ణ ఎమ్మెల్యేల‌కు మ‌ళ్లీ టికెట్లు కేటాయించార‌ని, కానీ లింగాయ‌త్ ఎమ్మెల్యేల‌పై మాత్రం ప్ర‌జావ్య‌తిరేక‌త అంటూ టికెట్ కేటాయించ‌లేదంటూ లింగాయ‌త్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు!

కేవ‌లం య‌డియూర‌ప్ప‌నే కాకుండా.. సిట్టింగ్ లింగాయ‌త్ ఎమ్మెల్యేల‌ను కూడా బీజేపీ ప‌క్క‌న పెట్టింద‌ని వారు వాదిస్తున్నారు. అలాగే య‌డియూర‌ప్ప‌ను కీల‌క నేత‌గా చెబుతున్నా.. ఆయ‌న‌ను బీజేపీలో ప‌ట్టించుకున వారు లేర‌నే వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి! మొత్తానికి అటు పాల‌న‌పై స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌త‌, దానికి తోడు ఈ లింగాయ‌త్ ఫ్యాక్ట‌ర్ ఇప్పుడు బీజేపీని ఆందోళ‌న‌కే గురి చేస్తున్న‌ట్టుగానే ఉంది!