కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడనే సామెత చందాన… టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి వ్యవహార శైలి వుంది. మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎందుకంత పట్టుదలకు పోతున్నారో అర్థం కావడం లేదని జీవీరెడ్డి అన్నారు. మార్గదర్శిపై సవాల్‌ను స్వీకరించానని తాను చెప్పిన తర్వాత ఉండవల్లి అన్న మాటలపై జీవీ అభ్యంతరం తెలిపారు.
మార్గదర్శిని టీడీపీ ఓన్ చేసుకుంటోందా? అని ఉండవల్లి అన్నారని, అది సరైంది కాదని జీవీరెడ్డి ఒక చానల్లో మాట్లాడుతూ తప్పు పట్టారు. అసలు రామోజీరావు తప్పులకు అతీతుడని, మార్గదర్శిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బల్ల గుద్ది తమ పార్టీ అనుకూల చానళ్లలో మాట్లాడుతున్న జీవీరెడ్డి…ఔను మేము మార్గదర్శిని ఓన్ చేసుకుంటున్నామని చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదు. మే 14వ తేదీ ఉండవల్లితో చర్చకు ముందే జీవీరెడ్డి చేతులెత్తేశారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఒకవైపు రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా సహాయం కావాలి, మరోవైపు ఆ సంస్థ తప్పుల్ని పార్టీ అధికార ప్రతినిధిగా సమర్థించేందుకు జీవీరెడ్డి సిగ్గుపడుతున్నారని ఆయన వెనుకంజే చెబుతోంది. మార్గదర్శి తరపున ప్రధాన ప్రతిపక్ష ప్రతిపక్షం పార్టీ తరపున చర్చకు వెళుతున్న వ్యక్తిని ఉండవల్లి మార్గదర్శిని ఓన్ చేసుకుంటుందా? అని ప్రశ్నించడం ఏ విధంగా తప్పు అవుతుందో జీవీరెడ్డి చెప్పాలి. మార్గదర్శి చేసింది తప్పు అని ఉండవల్లి న్యాయపోరాటం చేస్తున్నారు. కాదు మార్గదర్శి చేసింది ఒప్పు అని టీడీపీ అంటున్నప్పుడు, అదే విషయమై ఆయన సవాల్ స్వీకరించే వెళుతున్న వ్యక్తిని ఓన్ చేసుకుంటున్నారా? అని ప్రశ్నించగానే జీవీరెడ్డికి ఎందుకు కోపం వచ్చింది? రామోజీ పుణ్యాలు మాత్రం టీడీపీకి కావాలి, పాపాలు మాత్రం వద్దా? అని ప్రశ్నించే వాళ్లకు ఏం సమాధానం చెబుతారు?
రామోజీరావును రాజగురువుగా భావించే చంద్రబాబునాయుడే ఆయన పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తుంటారు. ఇక జీవీరెడ్డి లాంటోళ్లు రామోజీ, చంద్రబాబు విషయంలో ఎంతగా భక్తి ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్గదర్శి ఫైనాన్స్‌కు సంబంధించి ఉండవల్లి కుటుంబ సభ్యులు చిట్ వేయడం వల్లే ఆయన మోసాల్ని గుర్తించారు. రామోజీరావుపై మొదటి ఫిర్యాదుదారుడు ఉండవల్లే. తన పార్టీ ఎంపీకి వైఎస్సార్ మద్దతు ఇచ్చారే తప్ప, ఆయన చేసిందేమీ లేదు.
నాడు కాంగ్రెస్ ఎంపీగా మార్గదర్శి ఫైనాన్స్‌పై ఉండవల్లి ఏదో చేశారని, ఇప్పుడు ఏ పార్టీలోని లేని వ్యక్తి వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని జీవీరెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా వుంది. మార్గదర్శిపై ఉండవల్లి విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఇంప్లీడ్ పిటిషన్ వేసిందనే వాస్తవం కూడా తెలియని స్థితిలో జీవీరెడ్డి ఉన్నారా? ఇది జీవీరెడ్డి అజ్ఞానమా? లేక లోకానికి గంతలు కట్టొచ్చనే అతి విశ్వాసమా? మార్గదర్శిలో ఏమీ జరగలేదని అంటూనే, ఉండవల్లికి ఏం పని అని జీవీరెడ్డి ప్రశ్నించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఉండవల్లి పిటిషన్‌తో రామోజీ బాగోతాలు బయటికొస్తాయనే భయం రామోజీ, ఆయన్ను గుడ్డిగా సమర్థిస్తున్న వారి మాటల్లో కనిపిస్తోందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
అయినా పదేపదే ఉండవల్లికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్న జీవీరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మార్గదర్శిపై ఉండవల్లి పోరాటాన్ని ప్రశ్నించడానికి జీవీకి, టీడీపీకి ఏం సంబంధం? రామోజీపై ప్రేమ ఉంటే ఉండొచ్చు. రామోజీకి చెందిన మార్గదర్శి అవతకవకలపై కూడా అభిమానం ఉంటే ఎలా? అసలు మార్గదర్శి నిబంధనల ప్రకారం వసూళ్లు చేసిందా? లేదా? అని మాత్రమే ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రశ్నకు రామోజీరావే సమాధానం చెప్పడం లేదు. ఆయన తరపున జీవీరెడ్డి, పలు రాజకీయ పార్టీల నేతలు ఏవేవో సుద్దులు చెబుతున్నారు. టీడీపీ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటుందని జీవీరెడ్డి మరో జోక్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడితే టీడీపీ ప్రశ్నిస్తుందని ప్రగల్భాలు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదలుకుని పోలవరానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధుల మంజూరు, విశాఖకు రైల్వేజోన్, కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి విషయాలపై ఏనాడైనా కేంద్రాన్ని టీడీపీ ప్రశ్నించిందా? ఆ పాపంలో టీడీపీ, వైసీపీ, జనసేన భాగస్వామ్యం అయిన సంగతి వాస్తవం కాదా?
ఉండవల్లితో జీవీరెడ్డి చర్చ ఎలా వుండనుందో తాజాగా ఆయన మాటలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇక్కడ జీవీరెడ్డి తెలివితేటల్ని ఒప్పుకోవాలి. ఉండవల్లితో చర్చ అంటే కొండకు వెంట్రుక వేయడమే. ఉండవల్లితో చర్చకు కూచోవడం ద్వారా తెలుగు సమాజం దృష్టిని జీవీరెడ్డి ఆకర్షిస్తారు. ఇది రాజకీయంగా జీవీరెడ్డికి మంచిదే. అలాగే ఉండవల్లితో చర్చలో తేలిపోతే పోయేది టీడీపీ పరువే. ఫైనల్‌గా జీవీరెడ్డికి రాజకీయంగా ప్లస్. రాజకీయాల్లో పైకి రావాల్సిన అన్ని లక్షణాలు జీవీరెడ్డిలో ఉన్నాయని ఉండవల్లితో డిబేట్ అనే ఎపిసోడ్‌తో స్పష్టమైంది.