వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఎర్రగంగిరెడ్డికి కింది కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎర్రగంగిరెడ్డి బెయిల్పై బయట వుంటూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, దీంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందులో వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఇంప్లీడ్ అయ్యారు.
సీబీఐ పిటిషన్లో పేర్కొన్నట్టు ఎర్రగంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికి 72 సార్లు సీబీఐ విచారణకు ఎర్రగంగిరెడ్డి హాజరయ్యారని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
అయితే సాక్ష్యులను ప్రభావితం చేయడం, బెదిరించడం, అలాగే విచారణకు సహకరించలేదన్న సీబీఐ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దీంతో ఆయన బెయిల్ రద్దుకు న్యాయస్థానం ఆదేశించింది. మే 5వ తేదీలోపు సీబీఐ ఎదుట లొంగిపోకుంటే, అరెస్ట్ చేయవచ్చని దర్యాప్తు సంస్థను హైకోర్టు ధర్మాసనం ఆదేశించడం గమనార్హం. దీంతో వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టైంది.
వివేకా హత్య కేసులో ఉపశమనం పొందిన ఎర్రగంగిరెడ్డి పులివెందుల్లో దర్జాగా తిరుగుతున్నాడు. అతని బెయిల్ రద్దుపై మూడు నెలలుగా సీబీఐ, వివేకా కుమార్తె న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చివరికి సీబీఐకి ఊరట లభించింది. అయితే మే 5వ తేదీ వరకూ గడువు ఉండడంతో పైకోర్టుకు ఎర్రగంగిరెడ్డి వెళ్లే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.