విభజనపై మాట్లాడే హక్కు మోడీకి ఉన్నదా?

ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా విమర్శలు చేశారు. ఒకవైపు అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా.. ఎన్నికల ర్యాలీలకు వెళ్లడానికి జంకుతున్నారని, ర్యాలీలను విరమించుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ప్రధానమంత్రి.. పార్లమెంటు…

ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా విమర్శలు చేశారు. ఒకవైపు అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా.. ఎన్నికల ర్యాలీలకు వెళ్లడానికి జంకుతున్నారని, ర్యాలీలను విరమించుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ప్రధానమంత్రి.. పార్లమెంటు వేదికగా తన రాజకీయ ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే మాటల్లోనే కాంగ్రెస్ ను తూలనాడడానికి ఆయన అవకాశాలను వెదుక్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో భాగంగా.. ఏపీ విభజన గురించి ప్రస్తావించిన మోడీకి.. ఆ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా అనే ప్రశ్న ఇప్పుడు పలువురిని తొలిచేస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ రాబోయే వందేళ్లపాటూ అధికారంలోకి రాకుండా ఉండేందుకు సిద్ధమై ఉన్నదంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏయే రాష్ట్రాల్లో ఎప్పటినుంచి అధికారంలోకి రాకుండా కునారిల్లుతున్నదో ఆయన లెక్కలు చెప్పారు. ఆ విషయాలను, గణాంకాలను వల్లించడంలో నరేంద్రమోడీ గురివింద గింజ నీతిని పాటించినట్లుగా కనిపిస్తోంది. 

ఏయే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఠికానా లేకుండా ఉన్నదో, ఏయే రాష్ట్రంలో చరిత్రలో ఇప్పటిదాకా సొంతంగా అధికారంలోకి రాలేని దుస్థితిలో ఉన్నదో కూడా ఆయన లెక్క చెప్పి ఉంటే బాగుండేది. అదంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని నిందించడానికి ఆయన తాజాగా ఏపీ విభజన అంశాన్ని కూడా వాడుకున్నారు. 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు సరిగా లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో వ్యవహరించిన తీరు వలన ఆ రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోడీ సెలవిచ్చారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ ఒప్పుకుని తీరాల్సిన విషయం ఒకటుంది. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు సరిగా లేదన్నది ఓకే.. కానీ.. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నది.. కాంగ్రెస్ వలన కాదు.. ఆ తప్పిదాలను సరిదిద్దని.. విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చని, ప్రత్యేక హోదా విషయంలో గానీ, రైల్వేజోన్ విషయంలో గానీ, పోలవరం నిధుల విషయంలో గానీ.. అత్యంత హేయంగా వ్యవహరిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం తీరు వలన మాత్రమే. 

కాంగ్రెస్ పార్టీ విభజన సక్రమంగా చేయలేదు సరే.. వారు తప్పు చేశారనే అనుకుందాం. ఆ తప్పును మోడీ ఎందుకు దిద్దలేకపోతున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ ఏం తప్పు చేసిందో.. దానిని సరిదిద్దేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీకి ఆదరణ పెరిగేలా మోడీ చర్యలు తీసుకోవచ్పచు కదా. 

విభజన చట్టం ప్రకారం.. రెండు రాష్ట్రాలకు న్యాయంగా దక్కవలసిన వాటినే ఎగవేసి కేంద్రం వంచనకు పాల్పడుతోందనే విమర్శలు ప్రజలునుంచి ఎందుకు వస్తున్నాయి? ఈ విషయాలను నరేంద్రమోడీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది.