హైదరాబాద్ లో సుపారీ మర్డర్, ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ లో సుపారీ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు నమ్మించి, ఓ వ్యక్తిని హత్య చేశారు. బిహార్ కు చెందిన కిరాయి రౌడీలు ఈ ఘాతుకానికి పాల్పడగా, హత్యకు గురైన వ్యక్తి ఒకప్పుడు టాలీవుడ్…

హైదరాబాద్ లో సుపారీ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు నమ్మించి, ఓ వ్యక్తిని హత్య చేశారు. బిహార్ కు చెందిన కిరాయి రౌడీలు ఈ ఘాతుకానికి పాల్పడగా, హత్యకు గురైన వ్యక్తి ఒకప్పుడు టాలీవుడ్ నిర్మాత.

90ల్లో నిర్మాతగా సినిమాలు చేశారు అంజిరెడ్డి. అప్పట్లో 3 సినిమాల్ని ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సహ-నిర్మాతగా, మరికొన్ని సినిమాలకు ఫైనాన్షియర్ గా కూడా ఉన్నారు. ఆయన సినిమాలు చేస్తున్న టైమ్ లోనే కెమెరామెన్ రవి పరిచయమయ్యాడు. అలా అంజిరెడ్డి-రవి దశాబ్దాలుగా పరిచయస్తులుగా కొనసాగుతున్నారు.

రీసెంట్ గా అంజిరెడ్డి, తన లైఫ్ కు సంబంధించి కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ లో ఉన్న ఆస్తుల్ని అమ్మి, అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నారు. ఇదే విషయాన్ని రవి వద్ద ప్రస్తావించారు. దీంతో రవి, తన స్నేహితుడైన రాజేష్ కు విషయం చెప్పాడు.

రాజేష్ కూడా వ్యాపారస్తుడే. ఎలాగైనా అంజిరెడ్డి ఆస్తుల్ని కొట్టేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. ఆస్తులు కొనుగోలు చేస్తాం అంటూ నమ్మించి, అంజిరెడ్డికి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అంజిరెడ్డి ఆస్తుల్ని తన పేరిట రాయించుకున్నాడు రాజేష్. ఇక అతడ్ని తుదిముట్టించడమే మిగిలింది. అంజిరెడ్డి లేకపోతే, అతడికి చెందిన 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తమ వశమైనట్టేనని భావించారు.

దీనికోసం బిహార్ కు చెందిన ఓ గ్యాంగ్ కు 10 లక్షలు సుపారీ ఇచ్చాడు. అక్కడ్నుంచి నలుగురి దిగారు. రెక్కీ చేశారు. సికింద్రాబాద్ లోని డి-మార్ట్ సెల్లార్ లో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. అక్కడే అంజిరెడ్డిని హతమార్చారు. ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనుకున్నదే తడవుగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.

అయితే అంజిరెడ్డి ఒంటిపై ఉండాల్సిన బంగారం లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తీగ లాగితే డొంక కదిలింది. షాపింగ్ మాల్ బయట ఉన్న సీసీ కెమెరాల సాక్షిగా సుపారీ గ్యాంగ్ దొరికింది. నలుగురు బిహార్ జాతీయులతో పాటు.. రాజేశ్-రవి, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.