ఏజెంట్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో అఖిల్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇద్దరికీ కీలకమే. సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు అఖిల్. ఆ బ్రేక్ వచ్చినా రాకున్నా, అన్ని విధాలా హీరో మెటీరియల్ అని మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది. అఖిల్ వరకు ఏం జరిగినా ఫరవాలేదు. ఎందుకంటే మరో సినిమా, ఆ పై ఇంకో సినిమా వస్తుంది. ప్రూవ్ చేసుకునే అవకాశాలు వున్నాయి.
కానీ సురేందర్ రెడ్డికి కాస్త కష్టమే. ఎందుకంటే సినిమా హిట్-ఫెయిల్ అన్నది పక్కన పెడితే మేకర్ గా ఏలా వున్నారు అన్నది పాయింట్. సైరా సినిమాతో చాలా నెగిటివిటీనీ మూట కట్టుకున్నారు. సినిమాకు భయంకరంగా ఖర్చు చేయించేసారు అనే అపవాదు పైన వేసుకున్నారు. పైగా సినిమా డిజాస్టర్.
ఇప్పుడు ఏజెంట్ సినిమాకు కూడా అదే అపవాదు. నలభై కోట్లతో తీస్తామని చెప్పి 80 కోట్ల ఖర్చు అయిన వైనం. పైకి ప్రమోషన్లలో ఎన్ని కబుర్లు చెప్పినా, నిర్మాతకు-దర్శకుడికి మధ్య ఏం జరిగిందన్నది వారికి క్లారిటీగా తెలుసు. ఇండస్ట్రీ జనాలకు తెలుసు. అసలు విడుదల డేట్ ను ఫిక్స్ చేయడం కూడా నిర్మాత-హీరోల వత్తిడి మేరకు చేసారన్నది ఇన్ సైడ్ టాక్.
శుక్రవారం సినిమా విడుదల అంటే గురువారం వరకు ఇంకా అవుట్ పుట్ రెడీ అవుతూనే వుందనీ తెలుసు. ఓవర్ సీస్ ప్రీమియర్లు ఈ కారణంగానే లేట్ అవుతున్నాయని తెలుసు. నిర్మాత అనిల్ సుంకరకు ఈ సినిమా వల్ల విడుదల నాటికి కనీసం అయిదు కోట్ల భారం అనీ తెలుసు.
ఇన్ని తెలిసిన తరువాత మళ్లీ ఏ నిర్మాత-హీరో అయినా ముందుకు రావాలి అంటే అఖిల్ సినిమా పెద్ద హిట్ కావాలి. హిట్ అయితే నెగిటివ్ పాయింట్లు అన్నీ మరచిపోయి, నిర్మాతలు- హీరోలు సురేందర్ రెడ్డి వైపు చూస్తారు. అలా కాకపోతే చాలా మంది మహా మహా దర్శకులు మరుగున పడినట్లు, పడిపోయే ప్రమాదం అయితే వుంది.