దేశంలోని తమ పార్టీ నేతలందరినీ కర్ణాటకలో దించుతోంది భారతీయ జనతా పార్టీ. చిన్నా పెద్ద తేడా లేకుండా దేశంలోని బీజేపీ నేతలంతా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మొదలుకుని.. జిల్లా, మండలాలకు చొప్పున పక్క రాష్ట్రాల నుంచి నేతలను బీజేపీ ప్రచారంలోకి దించడం గమనార్హం.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ లు కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు రెండు రోజుల్లో. యోగి పేరు కర్ణాటకలో చెల్లుతుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాషాయం కట్టిన బాబాలు చాలా మంది కర్ణాటకలో రాజకీయాన్ని శాసిస్తూ ఉంటారు. వారి కాళ్లపై నేతలు మోకరిల్లుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో కాషాయం కట్టిన సీఎంకు అక్కడ ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం పట్ల బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది!
యోగి అంటే సరే, మరి చౌహాన్ అంటే అక్కడ ఎవరికి తెలుసు అనొచ్చు! అయితే బీజేపీ ఎవ్వరినీ వదలడం లేదు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, వివేక్ వెంకటస్వామి వంటి లీడర్లు కూడా తలా ఒక జిల్లాకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారట! ఇక డీకే అరుణ అక్కడే మకాం పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నారట. తెలుగు మాట్లాడే ప్రజలున్న చోట తెలంగాణ బీజేపీ నేతలంతా హడావుడి చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే మోడీ ఇరవై ర్యాలీలు, సభలతో ప్రచారంలో అంతా తానవుతున్నారు. మరోవైపు అమిత్ షా కూడా అక్కడే దృష్టి సారించారు. ఆపై కర్ణాటక నేతలు, మళ్లీ ఇలా పక్కరాష్ట్రాలు, దేశం నలుమూలల నుంచి నేతలు! ఇలా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఒక రేంజ్ లో ప్రచారాన్ని సాగిస్తూ ఉంది. అయితే సర్వేలు మాత్రం కమలం పార్టీకి జై కొట్టడం లేదు ఇప్పటి వరకూ. చాలా సర్వేల్లో బీజేపీ రేంజ్ 80 అని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే మాత్రం కమలం పార్టీకి భారీ ఝలక్కే అవుతుంది.