వేరే వ్యాపకం పెట్టుకోకుండా.. తమకు ఏడాదంతా ఆడే ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ప్రాంచైజ్ లు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నది దాదాపు రెండు నెలలే. మరి అలాంటప్పుడు ఈ యాజమాన్యాలు ఏడాది కాంట్రాక్టు ఆటగాళ్ల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాయనేది ఆసక్తిదాయకమైన అంశం.
ఐపీఎల్ ఏడాది పాటు సాగకపోయినా.. ఇప్పుడు ఐపీఎల్ యాజమాన్యాలకు వివిధ దేశాల క్రికెట్ లీగులలో జట్లు ఉన్నాయి. వాటిల్లో ఆడేందుకు కూడా క్రికెటర్లు కావాలి. ఐపీఎల్ జరిగే సమయంలో కాకుండా వేరే సీజన్లలో ఆ లీగులు జరుగుతున్నాయి.
కరేబియన్ క్రికెట్ లీగ్, సౌతాఫ్రికాలో ఇటీవలే మొదలైన క్రికెట్ లీగ్, ఇంకా అమెరికా వేదికగా ఇంకో క్రికెట్ లీగ్… రకరకాల లీగ్ లలో ఇవే ప్రాంజైజ్ లు తమ బ్రాండ్ జట్లను బరిలోకి నిలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఇక్కడ, అదే సౌతాఫ్రికన్ క్రికెట్ లీగ్ జరిగితే అక్కడ, అమెరికాలో మరేదో లీగ్ ను మొదలుపెడితే అక్కడ.. అలా ఏడదంతా ఇదే బ్రాండ్ జట్ల తరఫున బరిలోకి దిగడానికి ఈ యాజమాన్యాలకు ఆటగాళ్ల అవసరం ఏర్పడినట్టుగా ఉంది.
మరి ఐపీఎల్ అంటే రెండు నెలల పాటు. ఇప్పటికే దాదాపు ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ స్తంభించిపోతోంది. మొదట్లో ఐపీఎల్ కోసం వివిధ దేశాల క్రికెట్ బోర్డులు కాస్త అడ్జస్ట్ మెంట్ చేసేవి. అయితే ఇప్పుడు ఈ రెండు నెలలూ అంతర్జాతీయ క్రికెట్ నామమాత్రంగా మారిపోయింది.
ఇప్పుడు కూడా కొన్ని జట్లు ఏవో మ్యాచ్ లు ఆడుతున్నాయి కానీ, ఐపీఎల్ వార్తల్లో వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాంటి జట్లలో ఆటగాళ్లకు ఐపీఎల్ కాంట్రాక్టులు పెద్దగా లేవు కూడా! దేశం కోసం ఆడటానికి ఐపీఎల్ సగం సీజన్ నుంచి దూరం అవుతున్నాడు, తొలి సగం సీజన్ కు అందుబాటులో ఉండడు.. అంటూ అప్పట్లో కొంతమంది ఆటగాళ్ల విషయంలో వార్తలు వచ్చేవి. అయితే ఇప్పుడు అలాంటివి దాదాపు లేవు!
మరి కొందరు ఆటగాళ్లు అయితే వీలైనంత త్వరగా అంతర్జాతీయ కెరీర్ నుంచి వైదొలిగి ఐపీఎల్ తో పాటు ఇతర లీగులతో సహచర్యం చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఐపీఎల్ యాజమాన్యాలు కూడా బోర్డు, కాంట్రాక్టులు లేకుండా.. తాము చెప్పిన లీగ్ లలో ఆడటానికి తగ్గట్టుగా ఉద్యోగుల్లాంటి క్రికెటర్లను నియమించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నట్టుగా ఉన్నాయి.
మంచి పేరున్న, హిట్టర్లకు ఐపీఎల్ యాజమాన్యాలు యాభై కోట్ల రూపాయల వేతనం ఇచ్చైనా ఏడాది అంతా ఒప్పందం కుదుర్చుకోవడానికి చూస్తున్నాయని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెటర్ల విషయంలో ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి!