మంత్రి కొడాలి నానికి ప్రధాని ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. ఇంత వరకూ ఏపీకే పరిమితమైన కొడాలి పేరు … టీడీపీ పుణ్యమా అని జాతీయస్థాయిలో తెలిసిపోయింది. గుడివాడ కేసినో వ్యవహారంలో టీడీపీ, బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శించాయి. టీడీపీ దాన్ని ఇంకా కొనసాగిస్తోంది. గుడివాడలో కేసినో వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని అధికార పార్టీ వైసీపీని బద్నాం చేయాలని ప్రయత్నిస్తోంది.
గుడివాడలో కేసినో అంశాన్ని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ కేసినోపై టీడీపీ మరో ముందడుగు వేసింది. గుడివాడలో కేసినో వ్యవహారంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈడీ అధికారులకు టీడీపీ నేతలు రామ్మోహన్నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇలాంటి వాటిపై విమర్శల వరకూ బాగుంటాయి. టీడీపీకి మీడియా బలం ఉండడంతో చిన్న అంశాన్నైనా బూతద్దంలో చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కొన్నేళ్లుగా చేస్తున్నదే. దేశంలో మరేది లేదని కేసినోపై ఈడీ దర్యాప్తు చేస్తుందా? బీజేపీ పాల నలో గోవాలో కేసినో నిర్వహణపై ఎలాంటి దర్యాప్తు చేయాలి?
ఇలాగైనా ఏదో ఒకటి అధికార పార్టీపై పోరాటం చేస్తున్నామన్న సంకేతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దురుద్దేశం తప్ప, దీని వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటి? అయినా టీడీపీ పుట్టుకే కేసినో వ్యవహారం లాంటిదనే విమర్శలుంటే… ఆ పార్టీ విపరీత పోకడలకు వెళ్లడం ఏంటో! తనపై ఈడీకే కాదు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేయాలని కొడాలి నాని తన శత్రువైన చంద్రబాబుకు సూచించిన సంగతి తెలిసిందే.