ప్రధాని మోదీ రాజ్యసభ వేదికగా సరికొత్త డ్రామాకు తెరలేపారు. నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చేసిన తీరుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల క్రితం జరిగిన రాష్ట్ర విభజన అంశాన్ని మోదీ ఇప్పుడు ఎందుకని తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది.
రాష్ట్ర విభజనకు పెద్దమ్మ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే కాదని, చిన్నమ్మైన తనను కూడా గుర్తించుకోవాలని పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ దివంగత సుష్మాస్వరాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ మాత్రమే ద్రోహం చేసినట్టు, తామేదో న్యాయం చేసినట్టు మోదీ మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ ప్రసంగిస్తూ దేశంలోని అన్ని అవలక్షణాలకు కాంగ్రెస్ పాలనే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యాప్తంగా నాడు అనేక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి ఏ విధంగా రాష్ట్రపతి పాలనను కాంగ్రెస్ విధించిందో మోదీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఏపీ విభజనకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాజ్‌పేయ్ ప్రభుత్వం శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటు చేసిందన్నారు. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు అలా జరగలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మైకులు కట్ చేశారన్నారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారని గుర్తు చేశారు. ఎలాంటి చర్చే లేకుండా ఏపీని విభజించారన్నారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనమని విమర్శించారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రాన్ని సరిగా విభజించి వుంటే సమస్యలు వచ్చేవి కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై 8 సంవత్సరాలు కావస్తోంది. అప్పటి నుంచి మోదీనే ప్రధానిగా పాలన సాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయంగా జరుగుతోందని తాను అత్యున్నత చట్ట సభ వేదికగా చెబుతున్న నేపథ్యంలో, న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే నిలదీతలు వస్తున్నాయి.
విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చని ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, అలాగే వెనుకపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాల్లో మోదీ సర్కార్ నిర్దయగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే.
అందుకే బీజేపీకి ఏపీలో ఆదరణ కరువైంది. కాంగ్రెస్ అన్యాయం చేయడం వల్లే నామరూపాల్లేకుండా పోయింది. మరి తానెందుకు బలపడలేదో బీజేపీ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్‌ది గతించిన చరిత్ర. ఏపీలో పాగా వేయాలని కలలు కంటున్న బీజేపీ న్యాయం చేయాలనే అంశాన్ని మరిచిపోతే ఎలా? అవన్నీ వదిలేసి కాంగ్రెస్‌ను తిట్టడం వరకే ప్రధాని పరిమితమైతే రాజకీయంగా లాభం ఏంటి? అనేది తెలుగు సమాజం వేస్తున్న ప్రశ్న.