వీళ్ళు ఎంత గింజుకున్నా ప్రత్యేక హోదా రాదు

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. వాస్తవానికి చంద్రబాబుది పూర్తిగా టీడీపీ ప్రభుత్వం కాదు. అది బీజేపీ…

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. వాస్తవానికి చంద్రబాబుది పూర్తిగా టీడీపీ ప్రభుత్వం కాదు. అది బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వం. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టిన పార్టీ బీజేపీ అనే విషయం తెలిసిందే.

తరువాత అధికారంలోకి వచ్చేది తామేనని, ప్రత్యేక హోదా తప్పని సరిగా ఇస్తామని నరేంద్ర మోడీ సహా బీజేపీ పెద్దలంతా గట్టి హామీ ఇచ్చారు. తరువాత ప్రత్యేక హోదా కుదరదని ప్యాకేజీ ఇస్తామని చెప్పి అందుకు చంద్రబాబును ఒప్పించారు. దీంతో ఆయన హోదా కంటే ప్యాకేజీయే బెటర్ గా ఉంటుందని చెప్పి అది ఎలా ఉపయోగకరంగా ఉంటుందో ప్రచారం చేశారు. చంద్రబాబు యూ టర్న్ ను జగన్ ఉపయోగించుకొని తనకు అధికారం అప్పగిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు.

అప్పట్లో ఆంద్ర ప్రజలు హైదరాబాదు కోల్పోయామన్న బాధలోనూ, చంద్రబాబు కేంద్రానికి తలవంచి ప్యాకేజీకి ఒప్పుకున్నారన్న ఆవేదనలోనూ ఉన్నారు కాబట్టి జగన్ ఎలాగైనా హోదా తెస్తారన్న నమ్మకంతో అధికారం అప్పగించారు. కానీ ఎన్డీయే బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రాగానే జగన్ కు సీన్ అర్ధమైంది. కేంద్రం మెడలు వంచి హోదా తేవడం సాధ్యం కాదని తెలిసిపోయింది. ఎన్డీయేకు బంపర్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఏం చేయలేమని చేతులెత్తేశారు.

రాష్ట్రాభివృద్ధి సంగతి తరువాత ముందు జనాలను సంతృప్తి పరచాలని అనుకోని ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాల బాట పట్టారు. రాష్ట్రం విడిపోయిన కొత్తల్లో హోదా కోసం ఉద్యమించిన జనాలు క్రమంగా చల్లబడిపోయారు. తాజాగా రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే  విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. ఏపీలో విపక్షాలు తాము ప్రత్యేక హోదాపై పార్లమెంటులో మాట్లాడటం లేదని ఆరోపణలు చేస్తున్నట్లు గుర్తుచేశారు.

ఇప్పటికే ఏడుసార్లు ప్రధాని మోడీకి సీఎం జగన్ ప్రత్యేక హోదాపై విజ్ఢాపనలు ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక హోదా నిరాకరించేందుకు కేంద్రం చెప్తున్న ఆరు కారణాలు సహేతుకంగా లేవన్నారు. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని చెప్తున్నారని, తమకు ఇస్తూ వాటికి కూడా ప్రత్యేక హోదా ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు. కానీ హోదా గురించి అడిగారో లేదో  తెలియదు. అడిగినట్లు ఆధారాలు లేవు. 

మనం హోదా కోసం కేంద్రాన్ని అడుగుతూ ఉండాల్సిందే తప్ప ఇంకేం చేయలేమని అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ చెప్పారు. జగన్ ఏడుసార్లు మోడీకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని విజయసాయి చెప్పారు. మా లోపం లేకుండా హోదా కోసం అడుగుతూనే ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. కాంగ్రెస్ అంటే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిందని విజయసాయిరెడ్డి అన్నారు. కానీ ఆరోజు రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు, జగన్ అంగీకరిస్తూ లేఖలు ఇచ్చారు.

విభజనలో అన్యాయం జరిగిందేమోగానీ అన్యాయంగా విభజించలేదు. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామంటూ మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ నే కాదు, బీహార్ ను, మరో రెండు మూడు రాష్ట్రాలను కూడా మోసం చేసింది. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో జగన్ ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా హోదా రాదు. ఆ చాఫ్టర్ ముగిసిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కసి, పట్టుదల ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే హోదాతో పని లేకుండా రాష్ట్రం బాగుపడుతుంది.