చంద్రబాబు వదిలించుకోవల్సిన నాలుగు గ్రహదోషాలు

ప్రతి వ్యక్తికి గ్రహదోషాలుంటాయి. వాటికి శాంతులు, జపాలు ఉంటాయి. అవి చేస్తే దోషాలు తొలగిపోతాయంటారు. Advertisement కానీ ఆ గ్రహదోషాలు చాలాసార్లు వ్యక్తుల రూపంలో పక్కనే ఉంటుంటాయి. వాటికి జపాలుండవు. మనమే గుర్తించి వదిలించుకోవాలి.…

ప్రతి వ్యక్తికి గ్రహదోషాలుంటాయి. వాటికి శాంతులు, జపాలు ఉంటాయి. అవి చేస్తే దోషాలు తొలగిపోతాయంటారు.

కానీ ఆ గ్రహదోషాలు చాలాసార్లు వ్యక్తుల రూపంలో పక్కనే ఉంటుంటాయి. వాటికి జపాలుండవు. మనమే గుర్తించి వదిలించుకోవాలి. లేకపోతే వినాశనం తప్పదు.

గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు అమాయకుడైన మనిషి తనవాడిలా కనిపిస్తూ ప్రాణం తీసేవాడినే నమ్ముతాడు.

మనమిక్కడ చెప్పుకుంటున్నది చంద్రబాబు నాయుడు గురించి, తన చుట్టూ ఉన్న నాలుగు గ్రహాల గురించి.

కురువంశ నాశనానికి దుష్టచతుష్టయం ఎలాగో తెదేపా మాడి మసైపోవాడనికి ఈ చతుష్టయం అలాగన్నమాట.

ద్రౌపది నవ్విందని తనలోతానే కుమిలిపోయి ఏడ్చి పగపెంచుకుని చెయ్యకూడని పనులు చేసి కాళ్లు పగలగొట్టించుకున్నాడు దుర్యోధనుడు.

సరిగ్గా అదే టైపులో ఇక్కడ రఘురామరాజు కూడా తనకు తన పార్టీలో గుర్తింపు దక్కలేదన్న అవమానంతోనో, మరొక చెప్పుకోలేని కారణంతోనో సొంత పార్టీమీదే అవాకులు పేలి సెడిషన్ కేసులో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగారు. కాళ్లు పగిలాయని కంప్లైంటు కూడా ఇచ్చారు.

తాను రాజీనామా చేస్తానని శపథం చెయ్యడం అంతలోనే మాట మార్చి టీవీ ఛానల్లో కూర్చుని కామెడీ చెయ్యడం. తాను చేసే ప్రతిజ్ఞలకు కనీసమైన క్రెడిబిలిటీ కూడా లేకుండా ప్రవర్తించడం. ప్రెస్మీటుల్లో వెట”కారాలు”, మిరియాలు నూరడం మినహాయించి గత రెండున్నరేళ్లుగా వెలగబెట్టిందేమీ లేదు.

ఈయన చంద్రబాబు కనుసన్నల్లో బ్రతుకుతున్న వ్యక్తి అని ఎవర్నడిగినా చెప్తారు. రాజీనామా చెయ్యకుండా సొంత పార్టీపై బురదజల్లుతూ ఈయన పెట్టే ప్రెస్మీట్ల వల్ల తెదేపాపై మరింత చిరాకు, అసహ్యం పెరిగి ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డిపై సానుకూలత తగ్గకపోగా పెరుగుతోంది. చంద్రబాబు మొదటిగా వదిలించుకోవాల్సింది ఈ గ్రహదోషాన్నే.

ఇక రెండవ గ్రహం పవన్ కళ్యాణ్. పాపం ఇతను భారతంలో కర్ణుడు టైపు. తన మానాన తాను పార్టీ పెట్టుకుని ఏవో ప్రయత్నాలు చేసుకుంటుంటే ఆదరించి, సేదతీర్చి మధ్యమధ్యలో చేతులు తడుపుతూ ఇతన్ని పోషించే కార్యక్రమం తెదేపా పెట్టుకుంటోంది.

ఈ స్టంటంతా దేనికంటే వైసీపీ వ్యతిరేక వోట్లు జనసేన చీల్చకుండా అన్నమాట.

అంతోటి దానికి ఐదేళ్లూ పోషించడమెందుకు?

ఎన్నికలకి ఆర్నెల్ల ముందు నిజంగా లెక్కేసి అప్పటికీ ఓటింగులో ప్రభావం చూపించగలడనుకుంటే అప్పుడే అక్కునచేర్చుకోవచ్చుగా. అలా చెయ్యడం వల్ల చేతిలో తైలం లేక, అప్పటి వరకూ కేడర్ ని పోషించలేక ఎన్నికల టైముకి జనసేన నీరససేన అయ్యే అవకాశముంది.

ఇక్కడ భాజపాకైనా ఇదే లెక్క. తాము దువ్వకపోతే పవన్ కళ్యాణ్ తన మద్దతు డబ్బిస్తున్న చంద్రబాబుకి ఇస్తాడేమో అని అనవసర విలువిస్తున్నారు.

తెదేపా, భాజపా ..ఇద్దరూ పట్టించుకోకపోతే జనసేనకి ఫండ్స్ అందవు.

ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేకత రేసులో ఉన్న ముగ్గురిలో ఒకడు తగ్గుతాడుగా!! ఈ మర్మం గ్రహించి చంద్రబాబు వదిలించుకోవల్సిన రెండవ గ్రహదోషం ఇదే.  

ఇప్పుడు మూడో గ్రహదోషం దగ్గరకొద్దాం.

దుశ్శాసనుడు ఎలాగైతే అన్నగారి ఆనందం కోసం ద్రౌపది చీరలాగి ప్రమాదాన్ని కొనితెచ్చాడో, ఏబీయన్ రాధాకృష్ణ కూడా చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడ్డానికి పసుపుపచ్చని జర్నలిజం రాతలు రాసుకుంటూ ప్రజలకి వెగటు పుట్టించేస్తున్నాడు.

ఆ రాతల స్పీడులో తానేం రాస్తున్నాడో తనకే తెలియకుండాపోతోంది చాలాసార్లు.

లోకేష్ పుట్టుక గురించి వల్లభనేని వంశీ చేసిన కువ్యఖ్యని తెదేపా వ్యతిరేకులు కూడా ప్రచారం చెయ్యకుండా సంయమనం పాటిస్తున్న టైములో తొలిసారిగా దానిపై రాత రాసింది, కూత కూసింది ఆంధ్రజ్యోతి- ఏబీయన్ లే.

కొమ్ముగాస్తున్న భ్రమలో పార్టీ పళ్లు రాలగొడుతున్న ఘనత రాధాకృష్ణదే.

అలాగే అమరావతి ఉద్యమ రైతుల్ని తన ఛానల్ కి పిలిచి పెట్టిన చర్చాగోష్టిలో, “మీరెంత ఉద్యమం చేసినా తెదేపా చంకపోయిందని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా?” అని అడిగిన ఘనుడు.

కానీ పాపం ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నది కాదు. పార్టీ పునాదుల్ని పటిష్టం చేస్తున్నానన్న భ్రమలో సమాధి కట్టేస్తున్న అమాయకత్వమంతే.

పై ముగ్గురూ అయిపోయాక భారతంలో చివరాఖరి దుష్టచతుష్టయం మెంబరు శకునని అందరికీ తెలుసు.

ఇప్పుడైతే ఆ స్థానం రామోజీరావుదే. గతంలో ఎప్పుడూ తాను ప్రజలపక్షమే అనే పతివ్రత ఇమేజుని కాపాడుకుంటూ అవసరమొచ్చినప్పుడల్లా క్రేన్లేసి బాబుగార్ని పైకి లేపుతూ నిలబెట్టే ప్రక్రియ ఉండేది ఈనాడులో. ఈ మాధ్యన ఆ బ్యాలెన్స్ తప్పిపోయింది. ఆంధ్రజ్యోతితో పోటీ పడుతూ పసుపువార్తలు రాసేయడం విశృంఖలంగా పెరిగిపోయింది ఈ సంస్థలో.

ఒక కులానికి చెందిన పెద్దగా, కులపత్రిక నడుపుతున్న వ్యక్తిగా ముద్రపడిపోయిన ఈయనగారి నీడలో ఇంకా చంద్రబాబు సేదతీరునంటే ఇక ఎప్పటికీ వెలుగు చూడ్డం జరగదనేది తెలుసుకోవాలి.

మొత్తానికి తన మనుగడ కోసం పై నలుగుర్నీ సైలెంటు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుది.

ఈ వ్యాసం చదివి తెదేపా సానుభూతిపరులు, ఆలోచనాపరులు తెగబడరని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చంద్రబాబు వ్యతిరేక వ్యాసం కాదు. అనుకూలంగా రాసినదే. కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న తెదేపా ప్రమిదెలో కాస్త తైలం పోసే ప్రయత్నమే.

“ఆ నలుగురూ లేకపోతే ఇక తెదేపా గురించి మాట్లేడేవాడు ఉండడనా మీ ప్లాను?” అని నన్నడగొచ్చు.

నా సమాధానం ఒక్కటే- తెదేపాకి కొన్నాళ్లు కావల్సింది వాయిస్ కాదు, సైలెన్స్. తెదేపా సౌండ్ చేస్తున్నంత కాలం వైసీపీకి విజయం రీసౌండిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదంతే. పరిస్థితి అలా ఉంది.

2019 నుంచి 2021 వరకు జరిగిన పలు ఎన్నికల్లో తేదేపా నానాటికీ తీసికట్టవడానికి కారణం పై నలుగురే. అర్థమైనవాడికి అర్థమైనంత.

శ్రీనివాసమూర్తి