విశాఖ ఘనమైన నగరం. ఈ విషయంలో ఎవరికీ రెండవ ఆలోచన లేదు. విశాఖ నిన్నటికీ నేటికీ కూడా అలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాంటి నగరం మరో పాతికేళ్ళలో ఎంతలా విస్తరిస్తుంది అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి.
ఇప్పటికే పాతిక లక్షల జనాభా కలిగిన విశాఖ 2051 నాటికి కచ్చితంగా అర కోటికి పై దాటి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ముందు చూపుతో జగన్ ప్రభుత్వం విశాఖలో మౌలిక సదుపాయల కల్పనకు పెద్ద పీట వేస్తోంది.
అన్నింటికీ మించి విశాఖ నగర దాహార్తిని తీర్చేందుకు బృహత్తరమైన పధకాన్ని కూడా సిద్ధం చేస్తోంది. ఈ రోజుతాగు నీటి అవసరాలుమాత్రమే కాదు, 2051 నాటికి కూడా విశాఖ దాహం దాహం అంటూ అవస్థలు పడరాదు అన్నదే ప్రభుత్వ పెద్దల ఆలోచన.
దాంతో ఆ దిశగా భారీ ప్రాజెక్ట్ ని వైసీపీ సర్కార్ టేకప్ చేసింది. ఏకంగా 3,494 కోట్ల రూపాయలతో భారీ నీటి పైప్ లైన్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ముందుకు తెస్తోంది. దీని ద్వారా ఏలేరు కాలువ నుంచి నేరుగా 126 కిలోమీటర్ల దూరం దాకా పైప్ లైన్ల ద్వారా తాగు నీరు విశాఖ నగరానికి సరఫరా అవుతుంది.
అలా గోదావరి నీరు విశాఖ వాసులకు దక్కనుంది. దీని సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది మే నాటికి డీపీయార్ రెడీ చేయడానికి అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల నుంచి 11 టీఎంసీల నీరుని విశాఖకు తాగు నీటి అవసరాలకు కేటాయిస్తారు.
ఇక్కడ మరో విషయం ఉంది. ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా పోలవరం కాలువ ద్వారానే పైప్ లైన్ నిర్మాణం చేపడతారు. మొత్తానికి మరో పాతికేళ్ళకు ఏర్పడే నీటి కొరతను కూడా ముందే గుర్తించి ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా చేస్తున్న భగీరధ ప్రయత్నాన్ని నగర వాసులు స్వాగతిస్తున్నారు. విశాఖకు ఉజ్వల భవిష్యత్తుని అందించే పధకంగా కూడా దీన్ని చూస్తున్నారు.