పాల‌న‌పై వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడి విమ‌ర్శ‌ల క‌ల‌క‌లం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని పాల‌న‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే సోద‌రుడి విమ‌ర్శ‌లు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తు న్నాయి. జ‌గ‌న్ పాల‌న బ్రిటీష్ వాళ్ల‌కంటే దారుణంగా ఉంద‌ని క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని పాల‌న‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే సోద‌రుడి విమ‌ర్శ‌లు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తు న్నాయి. జ‌గ‌న్ పాల‌న బ్రిటీష్ వాళ్ల‌కంటే దారుణంగా ఉంద‌ని క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జునరెడ్డి సోద‌రుడు (చిన్నాన్న కుమారుడు), సుండుప‌ల్లె మండ‌ల వైసీపీ ఇన్‌చార్జ్ మేడా విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గం రాజంపేట‌ను కాద‌ని, రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌క‌టించ‌డాన్ని నిర‌సిస్తూ ఇవాళ రాజంపేట‌, నంద‌లూరులో జేఏసీ ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛందంగా బంద్ నిర్వ‌హిస్తున్నారు.

జేఏసీలో మేడా విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. రాజ‌కీయాలు, పార్టీల కంటే ప్రాంతానికే మొద‌టి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సొంత ప్ర‌భుత్వం రాజంపేట‌కు బ‌దులు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డాన్ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేకున్నారు.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం చేప‌ట్టిన బంద్‌ను విజ‌య‌వంతం చేసేందుకు విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి, కొండూరు శ‌ర‌త్‌కుమార్ రాజు, నంద‌లూరు మండ‌లాధ్య‌క్షుడు మేడా విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని ముందుకెళుతున్నారు. బంద్ సంద‌ర్భంగా మేడా విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ జ‌గ‌న్ పాల‌న‌ను తూర్పార ప‌ట్టారు. ప్ర‌జాభీష్టానికి వ్య‌తిరేకంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌క‌టించార‌ని విమ‌ర్శించారు.

అస‌లు ఏ మాత్రం సంబంధం లేని అన్న‌మ‌య్య పేరుతో రాయ‌చోటి కేంద్రంగా జిల్లాను ఎలా ఏర్పాటు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. కొంద‌రు వైసీపీ పెద్ద‌లు ఉద్దేశ పూర్వ‌కంగానే రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు రాయ‌చోటిని తెర‌పైకి తెచ్చార‌ని విమ‌ర్శించారు. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను వైసీపీ పెద్ద‌లు త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఉద్య‌మాన్ని అణ‌చివేయ‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ్రిటీష్ కాలం నాటి రోజుల‌ను గుర్తు చేస్తోంద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌జాభిప్రాయాన్ని గౌర‌వించి రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.