మన గురించి ఎదుటి వాళ్లు చెప్పే మాటలు కొన్నిసార్లు భలే నవ్వు తెప్పిస్తాయి. మనపై లోకానికి ఉన్న అభిప్రాయానికి భిన్నంగా ఎదుటి వాళ్ల ప్రశంసలు ఉన్నప్పుడు మనసులోనే పడిపడి నవ్వుకుంటాం. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కూడా అలాంటి అనుభూతి అనుభవంలోకి వచ్చి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి తన గురించి చేసిన ప్రశంసా పూర్వక వ్యాఖ్యలు తప్పకుండా జగన్ నవ్వుకుని వుంటారు.
తెలంగాణలో త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్సిన రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చినజీయర్ ఏమన్నారంటే…
‘విద్య, ధనం, వయసు, అధికారం కలిగి ఉన్న వారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ జగన్‌కు ఈ నాలుగు ఉన్నప్పటికీ ఎలాంటి గర్వం లేదు. పెద్దల మాటను గౌరవిస్తారు. పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.. పాటిస్తారు. జగన్మోహన్రెడ్డి మరింత ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా ’ అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ఏ లక్షణాలైతే అసలే లేవని సమాజం చర్చిస్తున్నదో, విమర్శిస్తున్నదో …అవే ఉన్నాయని త్రిదండి చినజీయర్ స్వామి చెప్పడం విశేషం. స్వామి చెప్పినట్టు జగన్ దగ్గర చదువు, ధనం, వయసు, అధికారం పుష్కలంగా ఉన్నాయి. కానీ గర్వం లేదనే మాట దగ్గరే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలను జగన్ స్వీకరిస్తారనే విషయమై జగనే మనసులో పడిపడి నవ్వుకుని ఉంటారని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. తాను చెప్పినట్టు ఎదుటి వాళ్లు వినాలే తప్ప, తాను వినడమనే మాటే జగన్ డిక్షనరీలో లేదని దగ్గరి వాళ్లు చెబుతుంటారు.
జగన్ సలహాలు స్వీకరిస్తారనేది ఈ ఏడాది అతిపెద్ద జోక్‌గా చెప్పుకోవచ్చని వైసీపీ నేతలు వెటకరిస్తున్నారు. సలహాలు స్వీకరించే మంచి లక్షణమే ఉంటే… పాలనలో ఒడిదుడుకులు ఉండేవి కావని వైసీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్న మాట. ఏది ఏమైనా త్రిదండి చినజీయర్ స్వామి అభిమానంతో జగన్‌పై రెండు మంచి మాటలు చెప్పారు. వాటిని ఎవరికి తోచినట్టు వారు విశ్లేసిస్తున్నారు.