పవన్ కల్యాణ్ కోరితే ఏం చేసేందుకైనా త్రివిక్రమ్ రెడీ. అదే టైమ్ లో త్రివిక్రమ్ చెబితే ఏం చేయడానికైనా పవన్ కల్యాణ్ రెడీ. ఇద్దరి మధ్య అనుబంధం అలాంటిది. అందుకే స్టార్ డైరక్టర్ గా కొనసాగుతున్నప్పటికీ, పవన్ కల్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుంటాడు త్రివిక్రమ్. గతంలో తీన్ మార్ సినిమాకు అలానే చేశాడు. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా కు ఇలానే చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కోసం మరోసారి త్రివిక్రమ్ బ్యాక్ సీట్లో కూర్చునేందుకు రెడీ అవుతున్నాడు.
పవన్ కల్యాణ్ మరో రీమేక్ చేయబోతున్నారనే వార్త తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో హిట్టయిన వినోదాయ శితం అనే సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై పవన్ కల్యాణ్ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పుడీ రీమేక్ ను తెలుగు నేటివిటీకి, పవన్ కల్యాణ్ స్టయిల్ కు తగ్గట్టు మార్చే బాధ్యతను త్రివిక్రమ్ కు అప్పగించారు.
ఇప్పటికే పవన్ కోసం భీమ్లానాయక్ ప్రాజెక్టులో అడుగుపెట్టాడు త్రివిక్రమ్. కాకపోతే అక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఓవైపు పవన్ కల్యాణ్ ఉంటే, మరోవైపు తన సొంత బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఉంది. కాబట్టి త్రివిక్రమ్ కు భీమ్లానాయక్ తప్పలేదు. కానీ ఈసారి 'సితార' లేదు. కానీ పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే త్రివిక్రమ్ కు ఈసారి కూడా తప్పలేదు.
పైగా ఈ ప్రాజెక్టు టోటల్ కాపీరైట్స్ జీ గ్రూప్ వద్ద ఉన్నాయి. త్రివిక్రమ్ పెన్ను పెడితేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని జీ గ్రూప్ గట్టిగా భావిస్తోంది. కాబట్టి పవన్ కోసం త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగక తప్పని పరిస్థితి.
అయితే మొన్నటివరకు త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు కానీ బండి నడిచింది. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ లాంఛ్ అయింది. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలి. ఇలాంటి టైమ్ లో పవన్-పీపుల్ మీడియా కోసం త్రివిక్రమ్ ఎంత టైమ్ కేటాయిస్తాడనేది డౌటానుమానం. జీ5 యాప్ లో ఈ సినిమా ఉంది. ఎప్పుడైతే పవన్ ఓకే అన్నాడో, అప్పుడిక తెలుగు వెర్షన్ ను తొలిగించింది సదరు సంస్థ.