గాయ‌కుడి అవ‌తార‌మెత్తిన వైసీపీ ఎమ్మెల్యే

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి గాయ‌కుడి అవ‌తార‌మెత్తారు. స‌హ‌జంగా సాహిత్యాభిలాషి, భావ‌కుడు, ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన భూమ‌న‌… తిరుప‌తిలో వ‌చ్చే నెల నిర్వ‌హించ‌నున్న తాత‌య్య‌గుంట గంగ‌మ్మకు స్వ‌ర కుంభాభిషేకం చేయ‌డం విశేషం. జాత‌రో జాత‌ర…

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి గాయ‌కుడి అవ‌తార‌మెత్తారు. స‌హ‌జంగా సాహిత్యాభిలాషి, భావ‌కుడు, ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన భూమ‌న‌… తిరుప‌తిలో వ‌చ్చే నెల నిర్వ‌హించ‌నున్న తాత‌య్య‌గుంట గంగ‌మ్మకు స్వ‌ర కుంభాభిషేకం చేయ‌డం విశేషం. జాత‌రో జాత‌ర అంటూ క‌రుణాక‌ర‌రెడ్డి ఉత్సాహంగా పాడారు. ఎమ్మెల్యేకు ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్ కోర‌స్ అందించ‌డం ఈ పాట‌లో ప్ర‌త్యేకం.

తిరుప‌తి తాత‌య్య‌గుంట గంగ‌మ్మ జాత‌ర రాయ‌ల‌సీమ‌లో ప్ర‌సిద్ధిగాంచింది. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చెల్లిగా గంగ‌మ్మకు ఆయ‌న పాదాల చెంత తిరుప‌తిలో ఆల‌యం నిర్మించారు. ఎమ్మెల్యే చొర‌వ తీసుకుని ఇటీవ‌ల ఆల‌య పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. టీటీడీ, రాష్ట్ర దేవాదాయ‌శాఖ సంయుక్తంగా సుమారు రూ.16 కోట్లు నూత‌న ఆల‌య నిర్మాణానికి చేయూత‌నివ్వ‌డం విశేషం. ప్ర‌స్తుతం నూత‌న ఆల‌య నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇటీవలే తిరుప‌తి గంగ‌జాత‌ర‌ను రాష్ట్ర పండుగ‌గా నిర్వ‌హించేందుకు ఏపీ స‌ర్కార్ జీవో సైతం విడుద‌ల చేసింది.

మే 9న రాత్రి  చాటింపుతో గంగ‌మ్మ జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా మొద‌లువుతుంది. వారం పాటు జాత‌ర‌తో తిరుప‌తి క‌ళ‌క‌ళ‌లాడ నుంది. చిత్ర‌విచిత్ర వేష‌ధార‌ణ‌లు ఈ జాత‌ర ప్ర‌త్యేకత‌గా చెప్పుకోవ‌చ్చు. జాత‌ర గొప్ప‌త‌నాన్ని తెలుగు స‌మాజానికి చాటి చెప్పేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గంగ‌మ్మ‌కు జాత‌ర నిర్వ‌హించ‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు, అమ్మ‌వారి స్ఫూర్తిదాయ‌క క‌థను స్థానికులు గొప్ప‌గా చెప్పుకుంటారు. అమ్మ‌వారి విశిష్ట‌త‌ను పాట‌ల రూపంలో చెప్ప‌డం ఓ ప్ర‌త్యేక‌త‌. జాత‌ర‌పై ఎమ్మెల్యే భూమ‌న ఆల‌పించ‌డం విశేషం.

“జాత‌రో జాత‌ర గంగ‌మ్మ జాత‌ర‌. ఏడాదికి ఒక‌సారి జ‌రిగే మా జాత‌ర‌. వెన్నెల్లు కురిపించే మా తిరుప‌తి జాత‌ర‌. రండి రండి మ‌న చేతులు క‌లుపుదాం. ఊరూవాడా అంతా క‌లిసి గంగ‌మ్మ‌కు మొక్కుదాం” అంటూ ఊపు తెచ్చేలా ఎమ్మెల్యే ఆల‌పించారు. ఈ పాట‌లో గంగ జాత‌ర‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆక‌ట్టుకుంటున్నాయి.