కర్ణాటక ఎన్నికల సంగ్రామంలో భారతీయ జనతా పార్టీ పూర్తి రిమోట్ పూర్తిగా ఢిల్లీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. కర్ణాటకలో బీజేపీ బలోపేతం కావడంలో స్థానిక రాజకీయానిదే పెద్ద పాత్ర. వాస్తవానికి ఇక్కడ బీజేపీ కనీస ఉనికిని సంపాదించుకోవడానికి చాలా సమయమే పట్టింది. చివరకు జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంతో బీజేపీ అధికార భాగస్వామి కాగలిగింది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో తమ వంతు కాలం అధికారాన్ని అనుభవించేసి, యడియూరప్ప వంతు వచ్చే సరికి కుమారస్వామి కుటిల రాజకీయం చేసి బీజేపీని బలోపేతం చేశాడు.
ఆ దఫా ఇరవై నెలల కాలం గనుక యడియూరప్ప అవకాశాన్ని జేడీఎస్ ఇచ్చి ఉంటే.. బీజేపీ ఇప్పటికీ యాభై సీట్లకు అటూ ఇటూ గానే పోరాడాల్సివచ్చేది. అయితే కుమారస్వామి అధికార దాహంతో సంకీర్ణంలో తన పదవీకాలాన్ని అనుభవించి, బీజేపీ సీఎం గా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేయగానే ప్లేటు ఫిరాయించాడు. దీంతో బీజేపీపై-యడ్డిపై సానుభూతి వెళ్లువెత్తింది. ప్రజల్లోకి వెళ్లి యడియూరప్ప కన్నీరు పెట్టుకోసాగాడు. తనను మోసం చేశారని వాపోయాడు. దీంతో సానుభూతి వర్షించింది. వెంటనే వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి దాదాపు రెట్టింపు సీట్లు దక్కాయి. యాభై సీట్ల పార్టీ కాస్తా 120 సీట్లకు దగ్గరైంది. సొంతంగా అధికారాన్ని అందుకునే వరకూ వచ్చింది!
అక్కడి నుంచి జేడీఎస్ స్థాయి క్రమంగా తగ్గిపోతూ ఉండగా, అటు జేడీఎస్ ను, ఇటు కాంగ్రెస్ ను మింగుతూ బీజేపీ బలోపేతం అయ్యింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తానేం తక్కువ కాదనిపించుకుంది. రాజకీయ అవినీతిలో భారీ స్కామ్ లు వెలుగు చూశాయి. యడియూరప్పను బీజేపీ అధిష్టానమే భరించలేకపోయింది. అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ నియమిత గవర్నర్ భరద్వాజ్ బీజేపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు.
చివరకు ఐదేళ్లు పూర్తయ్యే లోపే యడియూరప్ప జైలుకు వెళ్లి వచ్చారు. కొత్త సీఎంలు వచ్చారు. చివరకు బీజేపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ కు అప్పగించింది. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా, జేడీఎస్ తో చేతులు కలిపి దాదాపు ఇరవై నెలల పాటు ప్రభుత్వాన్ని అయితే కొనసాగించగలిగింది. ఆ తర్వాత బీజేపీ తనవైన ట్రిక్స్ తో మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. యడియూరప్పను చివరకు సీన్ నుంచి దాదాపు తప్పించేసింది.
ఇప్పుడైతే బీజేపీ ఒకే నినాదంతో ఉంది. అదే మోడీ! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, వ్యూహం.. ఇవన్నీ కేవలం ఢిల్లీ నుంచినే ఆపరేట్ అవుతున్నట్టుగా ఉన్నాయి. కనీవినీ ఎరగనిస్థాయిలో ఈ జాతీయ పార్టీ సిట్టింగులను, పాతవాళ్లను పక్కన పెట్టి మూడో వంతు సీట్లలో కొత్తవారిని బరిలోకి దించింది. మాజీ సీఎంలు, మాజీ డిప్యూటీ సీఎంలు బీజేపీని వీడే పరిస్థితీ వచ్చింది. ఇంకా బోలెడంతమంది అసంతృప్తవాదులున్నారు కానీ, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉండటంతో భయపడి కామ్ గా ఉన్నారు. ఇలా ఢిల్లీనే కర్ణాటక బీజేపీని సర్వత్రా నియంత్రిస్తోంది.
ఇక ప్రచారంలో కూడా మోడీ, అమిత్ షాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు ఇరవై రోజులున్న సమయానికి మోడీ ఇరవై ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారు! ఇప్పటికే చాన్నాళ్లుగా మోడీ కర్ణాటక చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరగబోతుంటే అక్కడ తిరడగడం మోడీ రాజకీయం. ఇదే వ్యవహారం కర్ణాటక విషయంలోనూ రిపీట్ అవుతోంది. పోలింగ్ కు ఇరవై రోజుల ముందు నుంచి మోడీ దాదాపు కర్ణాటకలోనే రేయీపగలూ కనిపించనున్నారు! మరోవైపు అమిత్ షా రోడ్డు ర్యాలీలు కూడా తీస్తున్నారు. సాధారణంగా పెద్ద నేతలు సభలకే పరిమితం అవుతూ ఉంటారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు రోడ్డు ర్యాలీలకు కూడా వెనుకాడటం లేదు. అటు సభలు, ఇటు ర్యాలీలు.. అంతా తామే అవతున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఊసు లేదు. తాజా మాజీ సీఎం బొమ్మైనే మళ్లీ సీఎంగా చేస్తామనే మాటా లేదు. కేవలం మోడీ, షాలు కాంగ్రెస్, జేడీఎస్ లపై విరుచుకుపడుతూ ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కర్ణాటకలో తాజామాజీ ప్రభుత్వం బీజేపీదే, కేంద్రంలో అధికారంలో ఉన్నదీ బీజేపీనే. మరి ఇలాంటి తరుణంలో కూడా ఇంకా కాంగ్రెస్, జేడీఎస్ లపై విరుచుకుపడితే ప్రజల్లో వచ్చే స్పందనే మిటనేది ఎన్నికల్లో తెలిసే అంశమే! ఒక్కటైతే నిజం.. కర్ణాటకలో బీజేపీ గనుక మరోసారి అధికారంలోకి వస్తే… ఆ క్రెడిట్ నిస్సందేహంగా మోడీ, షాలకే చెందుతుంది. ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి అందుకోలేకపోతే అప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారనేదే అసలు ప్రశ్న!
-హిమ