సీఎంకు సొంత జిల్లాలో షాక్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సొంత జిల్లా వాళ్లు షాక్ ఇచ్చారు. అన్న‌మ‌య్య పేరుతో రాయ‌చోటి కేంద్రంగా ప్ర‌క‌టించిన కొత్త జిల్లాకు వ్య‌తిరేకంగా ఉద్య‌మం ఉధృత‌మైంది. ముఖ్యంగా రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డాన్ని మ‌ద‌న‌ప‌ల్లె, రాజంపేట‌,…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సొంత జిల్లా వాళ్లు షాక్ ఇచ్చారు. అన్న‌మ‌య్య పేరుతో రాయ‌చోటి కేంద్రంగా ప్ర‌క‌టించిన కొత్త జిల్లాకు వ్య‌తిరేకంగా ఉద్య‌మం ఉధృత‌మైంది. ముఖ్యంగా రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డాన్ని మ‌ద‌న‌ప‌ల్లె, రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క వ‌ర్గాల ప్ర‌జ‌లు, నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. పార్టీల‌కు అతీతంగా ఉద్య‌మ బాట ప‌ట్ట‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

త‌న సొంత జిల్లాలో ఈ ప‌రిణామాల‌ను సీఎం జ‌గ‌న్ ఊహించి ఉండ‌రు. తాను ఏ నిర్ణ‌యం తీసుకున్నా, జిల్లా వాసులు గంగిరెద్దులా త‌ల‌లూపుతార‌ని ఆయ‌న భావించిన‌ట్టున్నారు. అందుకే అస‌లు డిమాండ్ చేయ‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను తెచ్చుకున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డిని సంతృప్తి ప‌రిచేందుకు మూడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీని బ‌లి పెట్ట‌డానికి సీఎం సిద్ధంగా ఉండాల‌నే హెచ్చ‌రిక‌లు సొంత పార్టీ నుంచే రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఇప్ప‌టికే రాయ‌చోటి జిల్లా కేంద్రాన్ని వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో కూడా ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల‌ను జిల్లా కేంద్రాలుగా ప్ర‌క‌టిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని, దానికి క‌ట్టుబ‌డి రాజంపేట‌ను ప్ర‌క‌టించాల‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా సాధించేందుకు అన్ని రాజ‌కీయ పార్టీల నేతృత్వంలో జేఏసీ ఏర్పాటైంది.

ఈ క్ర‌మంలో రాజంపేట‌ను జిల్లా కేంద్రం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఇవాళ రాజంపేట‌, నంద‌లూరులో బంద్‌కు జేఏసీ పిలుపు నిచ్చింది. బంద్‌లో భాగంగా విద్యా సంస్థ‌లు, వ్యాపార స‌ముదాయాల‌ను స్వ‌చ్ఛందంగా మూసివేసి త‌మ నిర‌సన‌ను ప్ర‌భుత్వానికి గ‌ట్టిగా పంపారు. ఒక‌వైపు బంద్‌, ర్యాలీలు, ధ‌ర్నాల‌కు అనుమ‌తి లేద‌ని, ఒక‌వేళ ఎవ‌రైనా నిర్వ‌హిస్తే చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించినా జ‌నం ఖాతరు చేయ‌లేదు.

జేఏసీ నాయ‌కులు రాజంపేట‌, నంద‌లూరులో క‌లియ తిరుగుతూ రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించి తీవ్ర అన్యాయం చేసింద‌ని జ‌నాన్ని చైత‌న్య ప‌రిచేందుకు య‌త్నిస్తున్నారు. రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డంతో మిగిలిన ప్రాంతాల్లో అధికార పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింది.