ఎంత కఠినంగా చట్టాల్ని రూపొందించినా మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. అత్యంత పాశవికంగా జరుగుతున్న ఘటనలు ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉన్నాయి. అలాంటిదే హేయమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అడిగినంత కట్నం తీసుకురాలేదనే కోపంతో, భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించాడు భర్త. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లోని న్యూ మండీ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది ఈ ఘటన. ఈ ప్రాంతానికి పర్వేజ్ కు కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రేష్మతో వివాహం కుదిరింది. కరోనా మొదలైన టైమ్ కే వీళ్లు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపరం కూడా చేశారు. అయితే పర్వేజ్ కు డబ్బు పిచ్చి ఎక్కువ.
దీంతో రోజూ డబ్బు తీసుకురావాలని రేష్మను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇవ్వలేదనేది పర్వేజ్ ఆరోపణ. కరోనా కారణంగా కొంత డబ్బు ఇవ్వలేకపోయామని రేష్మ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. అయితే పర్వేజ్ మాత్రం ఈ వ్యవహారాన్ని అంతటితో ఆపలేదు.
తన తల్లితో కలిసి రోజూ భార్య రేష్మను వేధించేవాడు పర్వేజ్. ఈ క్రమంలో ఏకంగా ఆమెను హత్య చేయడానికి తల్లికొడుకు ప్లాన్ వేశారు. తాము హత్య చేయాలి, కానీ అది ఆత్మహత్యగా కనిపించాలి. దీని కోసం యాసిడ్ ను ఎంచుకున్నారు. బలవంతంగా రేష్మితో యాసిడ్ తాగించారు. దీంతో రేష్మి అక్కడికక్కడే మృతి చెందింది.
జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త పర్వేజ్, బావలు జావేద్, శంషాద్, అత్త చమ్మీపై కేసు నమోదు చేశారు. రేష్మను భార్యగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం సాటి మనిషిగా కూడా చూడనందుకు పర్వేజ్ ను చుట్టుపక్కల ప్రజలు అసహ్యించుకుంటున్నారు.