ఏది నిజం, ఎంతవరకు నిజం, ఎవరిది కష్టం, ఏది కష్టం.. అనేది ఇప్పటి రోజుల్లో అంతుబట్టని రహస్యం. నిన్న కలెక్టరేట్ల ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేశారు. నేడు సీఎం జగన్ కి ఆ కార్మికుల్లో మరో వర్గం పాలాభిషేకాలకు సిద్ధమైంది.
వాస్తవానికి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగింది సీఎం జగన్ వచ్చిన తర్వాతే. కానీ పీఆర్సీ భ్రమలో పడిపోయి, కాంట్రాక్ట్ కార్మికులు కూడా వారితో జతకలిశారు. తీరా ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత తమ సంగతేంటంటూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టారు. నిన్నంతా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి, అరెస్ట్ లు కూడా జరిగాయి.
రెచ్చగొడితే రెచ్చిపోతారా..?
కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులకు కూడా.. సాధారణ ఉద్యోగుల లాగే వేతనాలు పెంచి, దాన్ని అమలు చేయాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం. పాదయాత్రలో కాంట్రాక్ట్ కార్మికుల కష్టాలు విని చలించిపోయిన జగన్, అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ కార్మికుల కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చారు. ఔట్ సోర్సింగ్ సంస్థలు జీతాల్లో పర్సంటేజీలు పట్టేసుకోకుండా నేరుగా ఉద్యోగులకే లబ్ధి చేకూరుస్తున్నారు.
అయితే రెగ్యులరైజేషన్ విషయంలో ఇంకాస్త కసరత్తులు జరుగుతున్నాయి. ఈలోగా పీఆర్సీ గొడవకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మద్దతు తెలపడం విశేషం. పోనీ ఆ గొడవ సద్దుమణిగాక అయినా ఉద్యోగులు వెనక్కి తగ్గాలి కదా. ఉపాధ్యాయులకు మద్దతుగా వీరంతా రోడ్డెక్కారు. సహజంగా కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్లు వామపక్షాల చేతుల్లో ఉంటాయి కాబట్టి, ఆందోళనలకు వారు ముందుకొచ్చారు, అరెస్ట్ అయ్యారు.
నేడు పాలాభేషేకాలు..
కాంట్రాక్ట్ ఉద్యోగులకు అత్యథిక లబ్ధి చేకూరింది, చేకూరేది కూడా జగన్ హయాంలోనే అంటూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మున్సిపల్ కార్మికుల్లో మరో వర్గం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తోంది. మరి వీరిలో ఎవరి వాదన కరెక్ట్.
నిజంగానే జగన్ ఉద్యోగులకు మేలు చేయకపోతే పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు.. ? పార్టీ తరపున జై జగన్ అన్నారంటే దానికో అర్థముంది, పార్టీలకతీతంగా ఉద్యోగులు జై జగన్ అంటున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలా వద్దా..? టీడీపీ ప్రోద్బలంతో జరిగే పోరాటాలను, వారి అనుకూల మీడియా హైలెట్ చేయడం వల్లే ఈ రాద్ధాంతాలు జరుగుతున్నాయి.