ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్పొద్దు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులేనని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యసభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన…

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులేనని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యసభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. ముందగా కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు విజయాలు, ప్రాధామ్యాలను వివరిస్తూ పార్లమెంట్‌ ఉభయసభలును ఉద్దేశించి  చేసిన ప్రసంగానికి గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ విజయసాయి రెడ్డి తన ప్రసంగం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రధానంగా రెండు అంశాలపైనే తాను ఈ చర్చలో మాట్లాడదలుచుకున్నట్లు చెప్పారు. ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రెండోది ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ సేకరణ పరిమితిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన అని చెప్పారు. నికర రుణ సేకరణ పరిమితిని తగ్గించడం రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం అని అన్నారు. అధికారంలోకి వచ్చాక  ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడం లేదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాపై (వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై) ఆడిపోసుకోవడం దినచర్యగా మారిందని అన్నారు. ఈ నేపధ్యంలో కొన్ని వాస్తవాలను సభ దృష్టికి తీసుకురాదలచినట్లు చెబుతూ ప్రత్యేక హోదా మంజూరుపై బీజేపీ ప్రభుత్వం చెబుతున్న కుంటిసాకులను ఒక్కొక్కటిగా ఆయన తిప్పికొట్టారు.

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 7 దఫాలు, హోం మంత్రి శ్రీ అమిత్‌ షాతో 12 దఫాలు సమావేశమయ్యారు. వీరిద్దరో జరిగిన ప్రతి సమావేశంలోను ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి లేవెనెత్తారు.

ఇటీవల తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులోకూడా ఆ సదస్సుకు అధ్యక్షత వహించిన హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో  ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు ప్రతిపక్షాలు ఆ స్థానంలో ఉండటానికి వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటానికి ప్రత్యేక హోదానే కారణం.

ప్రత్యేక హోదా అంశంపై చర్చకు గత పార్లమెంట్‌ సమావేశాలలో వాయిదా తీర్మానం ఇచ్చి తక్షణమే చర్చకు అనుమతించాలని కోరుతూ ఉభయ సభలను అనేక రోజులపాటు స్తంభింపచేశాం. ప్రత్యేక హోదా సాధన కోసం మేం చేయని ప్రయత్నాలంటూ లేవు. వాస్తవాలు ఇలా ఉండగా ప్రత్యేక హోదాపై మేం పార్లమెంట్‌లో పోరాడటం లేదని ప్రతిపక్షాలు అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నాయని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం కుంటిసాకులు ఇవీ…

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా  ఆరు కారణాలు చెబుతోంది. ఆ కారణాలన్నీ కేవలం కుంటి సాకులు మాత్రమే. అవి పూర్తిగా నిర్హేతుకమైనవి, అన్యాయమైనవి కూడా అని అన్నారు. రాష్ట్ర విభజన చట్టం రూపకల్పనలో అనేక లొసుగులు చోటుచేసుకున్నాయి. దానికి మేం బాధ్యులం కానే కాదు. ఆ లొసుగులనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను నిరాకరిస్తోందని ఆయన విమర్శించారు. హోదా నిరాకరణకు కేంద్రం చెబుతున్న సాకులను విజయసాయి రెడ్డి ఒక్కొక్కటిగా వివరిస్తూ వాటిని తూర్పారబట్టారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే విభజనకు గురైన జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, చత్తీస్‌ఘడ్‌ వంటి ప్రతి రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆనాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను విభజించింది. అయితే విభజనకు గురైన ఈ మూడు రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా తన రాజధానిని కోల్పోలేదు. రాజధాని నగరాలైన లక్నో, పాట్నా, భోపాల్‌ ఆయా రాష్ట్రాలలోనే మిగిలిపోయాయి. కానీ విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవలసి వచ్చింది.

హోదా ఇస్తామని ప్రధానే హామీ ఇచ్చారుగా…

విభజనకు గురైన ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధానమంత్రి వాగ్దానం చేశారా?…లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని సాక్షాత్తు నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

ఆర్థిక వెనుకబాటు నాటి ప్రధానికి తెలియదా…

ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. ఆర్థిక ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే వెనుకబడిన ఒడిషా, బీహార్‌ రాష్ట్రాలు కూడా హోదా కోసం డిమాండ్‌ చేస్తాయన్న కారణాన్ని కేంద్రం చూపిస్తోంది. ఒడిషా, బీహార్‌ ఆర్థికంగా వెనుకబడిన వాస్తవం ఆనాడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రికి తెలియదా అని శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ను కోల్పోతే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు తెలియదనుకోవడం కూడా పొరపాటని అన్నారు.

ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టలేదు….

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావనే లేనందున హోదా మంజూరు చేయలేమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర విభజన 2000లో జరిగింది. ఉత్తరాఖండ్‌ కొత్త రాష్ట్రంగా అవతరించింది. నాడు ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఉత్తరప్రదేశ్‌ విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. చట్టంలో లేకపోయినా ఉత్తరాఖండ్‌కు హోదా ఎలా కల్పించారు అని విజయసాయి రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. బీజీపే పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు మరో న్యాయం  ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా రాజకీయంగా సాధ్యపడదు…

ప్రత్యేక హోదా మంజూరు అనేది రాజకీయంగా సాధ్యపడే అంశం కాదని కేంద్రం చెబుతోంది. అలాంటప్పుడు 2021లో జరిగిన పాండిచ్చేరి ఎన్నికల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాండిచ్చేరికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఎలా ఇస్తారని విజయసాయి రెడ్డి నిలదీశారు. ప్రత్యేక హోదా అనేది బీజేపీకి రాజకీయ అంశం కావచ్చు…కానీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు అది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.

హోదా బదులు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చాం కదా…

ప్రత్యేక హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చాం కదా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ప్రత్యేక హోదా…ప్రత్యేక ప్యాకేజీకి ఏ విధంగాను ప్రత్యామ్నాయం కాబోదు. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి భారీఎత్తున వచ్చే పెట్టుబడుల ద్వారా జరిగే పారిశ్రామీకరణతో కలిగే ప్రయోజనాలు కొద్దిపాటి ఆర్థిక సాయంతో పోల్చుకుంటే ప్రత్యేక ప్యాకేజీ ఏమూలకు పనికి రాదని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి నాటి ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ప్రజాపోరాటాన్ని ఆయన నీరుగార్చేశారని  విజయసాయి రెడ్డి విమర్శించారు.

హోదా ఇవ్వమని 15వ ఆర్థిక సంఘం చెప్పలేదు….

గాడ్గిల్‌ కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక సంఘం సిఫార్సులను యధాతధంగా అమలు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అదే విషయాన్ని భారత రాజ్యాంగం కూడా స్పష్టంగా వివరించింది. ఆర్టికల్‌ 280 (2) ప్రకారం సిఫార్సులను రాష్ట్రపతికి సమర్పించడం మాత్రమే ఆర్థిక సంఘం విధి అని రాజ్యాంగం చెబుతోంది. అదే విషయాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తన నివేదికలో స్పష్టం చేసిందని విజయసాయి రెడ్డి చెప్పారు.

ఏపీకి హోదా ఇవ్వాలని కమిటీ సిఫార్సు….

ఆంధ్రప్రదేశ్‌తోపాటు విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని కామర్స్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన 164వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి వివరిస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు మానుకుని అనేక ఇబ్బందులలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మంజూరు చేయడం ద్వారా ఆదుకోవాలని కోరారు.

నికర రుణ సేకరణపై ఆంక్షలు వద్దు…

రెండవ అంశం కింద ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ సేకరణ పరిమితిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో తెలగుదేశం ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వంటి తప్పిదాలకు ఈనాడు తెలుగు ప్రజలను శిక్షించడం తగదని విజయసాయి రెడ్డి అన్నారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం శిక్షించాలనుకున్నప్పుడు దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో రుణ పరిమితి కంటే తక్కువగా రుణాలు పొందిన వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వాలి కదా అని ఆయన అన్నారు.

నికర రుణ సేకరణ పరిమితిపై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత మెరుగ్గా ఉందో గణాంకాలతో సహా వివరించారు. 2019-20లో కేంద్ర ప్రభుత్వంలో ద్రవ్యలోటు 4.6 శాతం ఉంటే, ఏపీలో అది 4.1 శాతం ఉంది. 2020-21లో కేంద్రంలో లోటు 9.2 శాతం ఉంటే ఏపీలో అది 5.4 శాతం ఉంది. 2021-22లో కేంద్రంలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉండగా ఏపీలో 3.5 శాతం ఉందని చెప్పారు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ సేకరణ పరిమితిపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.