తెలుగుదేశం పార్టీ ఏలుబడి సాగించిన జమానాలో మంత్రిగా వెలగబెట్టిన కడపజిల్లా నాయకుడు ఆదినారాయణ రెడ్డి, ప్రస్తుతానికి తన మనుగడ కోసం బిజెపిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు స్కెచ్ ప్రకారం పనిచేస్తున్న అనేకమంది కోవర్టుల్లో ఆదినారాయణరెడ్డి కూడా ఒకరు అని ఆయన ఏమాటలను గమనించినా అర్థమవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లోగా.. బిజెపితో కలిపి పొత్తు కుదరకపోతే ఆయన తిరిగి టీడీపీలో చేరుతారని కూడా ఒక ప్రచారం ఉంది. అలాంటి ఆది నారాయణరెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మీద ఒక దుష్ప్రచారంతో ఫిటింగ్ పెట్టే పనిలో ఉన్నారు.
జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కిందనే తృప్తి లేదని, ప్రధాని పదవి కూడా కావాలని ఆయనకు ఆశ పుట్టిందని ఆదినారాయణరెడ్డి అంటున్నారు. తద్వారా.. భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్రమోడీకి జగన్ పట్ల ఒక విముఖత రావాలని ఆయన కలగంటున్నట్టుగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రతినిధిగా, కేంద్రంతో కార్యసాధనకోసం ప్రధాని మోడీతోనూ సత్సంబంధాలు నెరపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలకు గండి కొట్టాలని ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అందుకే జగన్ కు ప్రధాని పదవి మీద ఆశపుట్టిందనే ఒక అవతవక ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
నిజానికి వివేకా హత్యకు సంబంధించి.. ఆదినారాయణ రెడ్డి పాత్రచాలా ఉన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్, అవినాష్ రెడ్డి వర్గీయులు తొలినుంచి ఆరోపిస్తున్నారు. తాము చేస్తున్న ఆరోపణలను పట్టించుకోకుండా, కనీసం విచారించకుండా.. సీబీఐ దర్యాప్తు ఏకపక్షంగా వెళుతోందనేదే వారి ఆవేదన కూడా. ఇలాంటి సమయంలో ఆదినారాయణ రెడ్డి.. జగన్ మీద మరిన్ని నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. సీబీఐ తీరును వెనకేసుకు రావడం ఆయన ఉద్దేశ్యం. ఇందుకు సంబంధించి అవినాష్ రెడ్డి మీద మరింతగా బురద చల్లడమూ, పనిలోపనిగా జగన్ ను కూడా ఇరికించే వ్యాఖ్యలు చేయడమూ ఆయన కోరిక. బిజెపి అండచూసుకుని ఆయన అడ్డగోలుగా రెచ్చిపోతున్నారనే వాదన కూడా ఉంది.
తృప్తి- అసంతృప్తి లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ.. సీఎం పదవితో తృప్తిలేక ప్రధాని పదవి మీద జగన్ కన్నేశారని అంటున్న ఈ టీడీపీ కోవర్టు నాయకుడు.. తాను ఒకసారి మంత్రిగా వెలగబెట్టిన తర్వాత.. ఆ పదవితో, ఆ పదవిని ఇచ్చిన తెలుగుదేశంతో తృప్తిపడకుండా ఎందుకు పార్టీ ఫిరాయించారో.. ఇలాంటి తృప్తి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో మరి?