దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా స్వాగతం పలుకుతూ ప్రొద్దుటూరులో పోస్టర్లు వేయడంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ప్రధాన కూడళ్లలో సునీతకు టీడీపీ స్వాగతం పలుకుతున్న పోస్టర్లు ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పోస్టర్లపై వరదరాజులరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా వైసీపీ చర్యగా ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరులో వాల్ పోస్టర్లు వేయడం నీచమైన చర్య అని వరదరాజులరెడ్డి విరుచుకుపడ్డారు. స్థానిక నాయకులు దురాలోచన ఏంటో తెలియదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. సునీత రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదన్నారు.
రాజకీయాల గురించి మాట్లాడాలని ఆమె అనుకోలేదన్నారు. తమతో కూడా మామూలు విషయాలు మాట్లాడ్డమే తప్ప, రాజకీయాలు మాట్లాడదన్నారు. అలాంటి మహిళపై వాల్‌పోస్టర్లు వేసి బజారున పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి పని చేయడానికి సిగ్గులజ్జ లేవా అని వరదరాజులరెడ్డి ధ్వజమెత్తారు. తన తండ్రిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేసేందుకు సునీత పోరాడుతోందన్నారు. వైఎస్ వివేకా రెండో భార్య వుందంటూ చనిపోయిన మనిషి గురించి చెడుగా చిత్రీకరించడం సంస్కారమా? అని ఆయన నిలదీశారు. ఇలాంటివి తెరపైకి తీసుకొచ్చి సునీత, ఆమె భర్తే మాజీ మంత్రి వివేకాను చంపించారని ఆరోపించడానికి మీకు సిగ్గు, మానవత్వం లేదా అని వైసీపీ నేతల్ని ఆయన నిలదీశారు.
ఇలాంటి పోస్టర్లు వేయడం ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని హితవు చెప్పారు. రాజకీయాల్లోకి వద్దని సునీతకు చెప్పామన్నారు. రాజకీయాలు నీచమయ్యాయని సునీతతో చెప్పినట్టు వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. పెదనాయన (వైఎస్సార్)తోనే రాజకీయాలు ముగిశాయని సునీతకు వివరించామన్నారు.
తాము చెప్పినదానికి సునీత కుటుంబ సభ్యులు కూడా ఏకీభవించారన్నారు. సునీత పోస్టర్లను దొంగగా వేశారన్నారు. టీడీపీ నేతలతో కలిపి సునీత పోస్టర్లను వేయడం సిగ్గు చేటన్నారు.