అందానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు హీరోయిన్లు. పొద్దున్న లేచిన్నుంచి అందాన్ని కాపాడుకోవడంపైనే వాళ్ల దృష్టి ఉంటుంది. పూజా హెగ్డే కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అయితే చాలామంది హీరోయిన్లలా తను రసాయనాల్ని పెద్దగా వాడనంటోంది ఈ హీరోయిన్.
ముఖంలో మెరుపు కోసం పూజాహెగ్డే రోజూ ఏం చేస్తుందో తెలుసా? పొద్దున్నే పాల మీగడలో పసుపు కలిపి, ఆ పేస్ట్ ను ముఖానికి పట్టిస్తుందట పూజా. ఇలా చేయడం వల్ల ముఖం రోజంతా మెరుస్తూ ఉంటుందని, ఇది పూర్తిగా సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ అని చెబుతోంది.
ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడుతూనే, రోజూ తినే భోజనంలో కార్బొహైడ్రేట్లు, నెయ్యి ఉండేలా చూసుకుంటుందట. చాలామంది హీరోయిన్లు బరువు పెరుగుతామనే భయంతో కార్బోహైడ్రేట్స్ ను వదిలేస్తారు. కానీ అలా చేయడం వల్ల ముఖవర్చస్సు దెబ్బతింటుందని చెబుతోంది పూజాహెగ్డే. సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ తినడంతో పాటు, రోజూవారీ ఆహారంలో నెయ్యిని ఉపయోగించడం వల్ల ముఖం మెరుస్తుందని చెబుతోంది.
ఇక బయటకు వెళ్లేముందు చేతులకు, భుజానికి, మెడకు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలంటోంది పూజా. ఇలా చేయడం వల్ల చర్మం కమిలిపోకుండా ఉంటుందని చెబుతోంది.
ఇక షూటింగ్స్ లేని సమయాల్లో పూర్తిగా మేకప్ కు దూరంగా ఉంటుందట ఈ ముద్దుగుమ్మ. అలా చేయడం వల్ల ముఖంలోని సహజమైన కాంతి మరింత మెరుగవుతుందని, సహజమైన అందాన్ని కాపాడుకోవడానికి మేకప్ కు దూరంగా ఉండడమే సరైన మార్గమని అంటోంది.