రూ.2వేలు పెట్టి కొన్నాడు.. రూ.74 కోట్లు అయింది

అదృష్టం ఎవరికి, ఎప్పుడు ఎలా కలిసొస్తుందో చెప్పలేం. జర్మనీకి చెందిన క్లిఫోర్డ్ స్కోరర్ కూడా అలాంటి అదృష్టవంతుడే. కేవలం 2వేల రూపాయలు పెట్టి కొన్ని ఓ పెయింటింగ్, ఇప్పుడు అతడికి అమాంతం 74 కోట్ల…

అదృష్టం ఎవరికి, ఎప్పుడు ఎలా కలిసొస్తుందో చెప్పలేం. జర్మనీకి చెందిన క్లిఫోర్డ్ స్కోరర్ కూడా అలాంటి అదృష్టవంతుడే. కేవలం 2వేల రూపాయలు పెట్టి కొన్ని ఓ పెయింటింగ్, ఇప్పుడు అతడికి అమాంతం 74 కోట్ల రూపాయలు అందిస్తోంది. భలే మంచి చౌకబేరము అంటే ఇదే కదా.

క్లిఫోర్డ్ ఆర్ట్ గ్యాలరీ కన్సల్టెంట్. ఎక్కడైనా మంచి పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్క్ కనిపిస్తే కొంటుంటాడు. 2019లో మసాచుసెట్స్ లో పర్యటిస్తున్న టైమ్ లో ఓ బుక్ స్టోర్ లోకి వెళ్లాడు. అక్కడున్న బుక్ స్టోర్ యజమానికి, క్లిఫోర్డ్ కు ఓ పెయింటింగ్ చూపించాడు. కేవలం 30 డాలర్లు (2వేల రూపాయలు)కు ఆ పెయింటింగ్  అమ్మేశాడు.

పెయింటింగ్ కొన్న తర్వాత క్లిఫోర్డ్ కు అనుమానం వచ్చింది. అది సాధారణ పెయింటింగ్ కాదని అతడు భావించాడు. దాని ప్రామాణికతను నిర్థారించేందుకు అతడు మూడేళ్లు కష్టపడ్డాడు. వివిధ దేశాలు తిరిగి ఎంతో సమాచారం సేకరించాడు. అలా 17 విమాన ప్రయాణాలు చేసి, నిపుణులతో మాట్లాడి క్లిఫోర్డ్ తెలుసుకున్న విషయం ఏంటంటే.. ఆ పెయింటింగ్ ను ప్రముఖ చిత్రకారుడు ఆల్బ్రెచ్ డ్యూరర్ గీశాడు.

జర్మనీ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో డ్యూరర్ ఒకడు. 16వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రకారుడు, ప్రపంచం మెచ్చిన అత్యుత్తమ కళాకారుల్లో ఒకడు. తన రచనలు, పెయింటింగ్స్ ద్వారా జర్మనీ పునరుజ్జీవనానికి ఎంతో పాటుపడ్డాయి. 1500 సంవత్సరంలో ఇతడు గీసిన పెయింటింగ్ పేరు ది వర్జిన్ అండే ఛైల్డ్. అదే ఈ పెయిటింగ్.

ఇన్నాళ్లూ మరుగునపడిన ఈ పెయిటింగ్, ఇప్పుడు అక్షరాలా 74 కోట్ల రూపాయల ధర పలుకుతోంది. జర్మనీకి చెందిన ఓ వేలం సంస్థ ఈ పెయిటింగ్ ను అమ్మకానికి పెట్టింది.