ఉద్యోగులంటే చంద్రబాబు దృష్టిలో అంటరాని వారు. వాళ్ల పేరు ప్రస్తావిస్తే ఆయనకు విపరీతమైన కోపం. అసలు ఉద్యోగులనే వ్యవస్థే ప్రభుత్వానికి గుదిబండగా ఆయన భావిస్తారు. ఉద్యోగులపై తన మనసులో మాటను ఆయన అక్షరీకరించారు కూడా. తాజాగా జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు కోపంగా ఉన్నారనేది వాస్తవం. అలాగని ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఉద్యోగులు అనుకూలంగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సహజంగా జగన్‌పై ఏ వర్గమైనా కోపంగా ఉందంటే, దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు వైఖరి అందుకు భిన్నంగా ఉంది. కేవలం చలో విజయవాడకు ఉద్యోగులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో వారేమైనా ఉగ్రవాదులా అరెస్ట్ చేయడానికి అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లపై, ప్రభుత్వంతో చర్చలు, అనంతర పరిణామాలపై ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.
తమకు వ్యతిరేక నాయకుడిగా చంద్రబాబును ఉద్యోగులు గుర్తించుకుంటారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ ఎల్లో మీడియాధిపతి ఆ నా కొడుకులకు జీతాలు ఇచ్చేందుకా ప్రజలు ట్యాక్స్‌లు కట్టేదని దూషణలకు దిగినా… కనీసం చంద్రబాబు ఖండించలేదు. ఎందుకంటే చంద్రబాబు అభిప్రాయం కూడా అదే కాబట్టి అని అప్పట్లో చర్చ జరిగింది. చివరికి ఉద్యోగుల ఆగ్రహానికి చంద్రబాబు బలి కావాల్సి వచ్చింది.
ఇలా ఏ రకంగా చూసినా ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కఠినంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తారనే పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆయన పాలిట శాపమైంది. ఇప్పుడు ఉద్యోగులకు అనుకూలంగా మాట్లాడినా ఎవరూ నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు. ఉద్యోగుల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ అంతర్గత సమావేశంలో సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం.
ప్రజల్లో ఉద్యోగులపై మంచి అభిప్రాయం లేదని, అలాంటి వారిపై పార్టీ సానుకూల వైఖరి తీసుకుంటే, తమపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని మెజార్టీ నేతలు చెప్పడంతో చంద్రబాబు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెలిసింది. మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్నా ఉద్యోగుల విషయంలో చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పొచ్చు.