నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా ది ఘోస్ట్. ప్రారంభమైనప్పట్నుంచి ఈ సినిమాకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా కోసం దుబాయ్ లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు నుంచి ఆ షూటింగ్ మొదలవ్వాలి. కానీ ఘోస్ట్ షూటింగ్ ఆగిపోయింది. అంతా సెట్ అయిందనుకున్న టైమ్ లో యూనిట్ లో కొంతమంది కీలక సభ్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో షెడ్యూల్ నిలిచిపోయింది.
ప్రారంభమైనప్పట్నుంచి ఈ సినిమాపై ఏదో ఒక అనుమానం కలుగుతోంది, ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు చాలామంది. కానీ ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ షూటింగ్ మొదలుపెట్టారు. అంతలోనే సినిమా నుంచి కాజల్ తప్పుకుంది. గర్భం దాల్చడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్ తప్పుకుంది.
కాజల్ స్థానంలో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఆమెతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. కానీ యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో దుబాయ్ షెడ్యూల్ నిలిచిపోయింది. నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బంగార్రాజు సక్సెస్ తో ఊపు మీదున్న నాగార్జున.. అదే జోష్ లో ఘోస్ట్ షూటింగ్ ను పూర్తిచేయాలనుకున్నాడు. కానీ అతడి ఉత్సాహానికి ఎప్పటికప్పుడు బ్రేకులేస్తోంది ఈ ప్రాజెక్టు. ఘోస్ట్ లో మాజీ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడట నాగ్.