ఏ అంశం ఎత్తుకోవాలి.. చెల్లాచెదురైన టీడీపీ

వైసీపీని ఇరుకునపెట్టేందుకు, సీఎం జగన్ ను టార్గెట్ చేసేందుకు ఏ అంశాన్ని ఎత్తుకోవాలో అర్థంకాని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది టీడీపీ. మొన్నటివరకు క్యాసినో అంశం ఎత్తుకున్నారు. అంతలోనే ఉద్యోగుల పీఆర్సీ అంశం తెరపైకి వచ్చింది.…

వైసీపీని ఇరుకునపెట్టేందుకు, సీఎం జగన్ ను టార్గెట్ చేసేందుకు ఏ అంశాన్ని ఎత్తుకోవాలో అర్థంకాని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది టీడీపీ. మొన్నటివరకు క్యాసినో అంశం ఎత్తుకున్నారు. అంతలోనే ఉద్యోగుల పీఆర్సీ అంశం తెరపైకి వచ్చింది. పోనీ దాన్ని ఎత్తుకుందామంటే రాజకీయాలు వద్దని ఉద్యోగ సంఘాల నేతలు డైరక్ట్ గా చెప్పేశారు. పైగా సమస్య కూడా సాల్వ్ అయింది. క్యాసినోనే కొనసాగిద్దామనుకుంటే పాతబడి పోయింది.

ఈ రెండు అంశాల మధ్యలో కొత్త జిల్లాల అంశం తెరపైకొచ్చింది. పోనీ దాన్ని హైలెట్ చేద్దామనుకుంటే ఎక్కడికక్కడ అంతా సర్దుబాటు అయ్యే పరిస్థితులున్నాయి. మరోవైపు పోలవరం అంశంపై మాట్లాడ్డానికి టీడీపీకి నోరు రావడం లేదు. కేంద్రం ఇచ్చిన తాజా సమాచారాన్ని, గత లెక్కల్ని తిరగదోడితే బాబు బండారం బయటపడుతుంది. కరోనా కేసుల్ని, పాఠశాలలు తెరిచే అంశాన్ని ఎత్తుకుందామంటే.. మొత్తం దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది.

రోడ్లు-గుంతలు అంశాన్ని మరోసారి ఎత్తి చూపుదామంటే.. ఆల్రెడీ నిధుల కేటాయింపులయ్యాయి. ఎక్కడికక్కడ టెండర్లు ఖరారు అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఏం అంశంపై పోరాటం చేయాలో తెలియక టీడీపీ నేతలు తలో ఇష్యూని పట్టుకున్నారు. ఎవరు ఏ టాపిక్ మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి. దీనికితోడు సోమిరెడ్డి లాంటి నేతలు లోకల్ ఇష్యూస్ పై దృష్టి పెట్టి, టీడీపీకి రావాల్సిన చిన్నపాటి మైలేజీని కూడా రాకుండా నాశనం చేస్తున్నారు.

పీఆర్సీ గొడవ తేలిపోవడంతో మళ్లీ మొదలు..

అసలే సమస్యల దారిద్రంలో ఉన్న టీడీపీకి ఇటీవల ఉద్యోగుల పీఆర్సీ అంశం కోతికి కొబ్బరి చిప్పలా దొరికింది. ఓవైపు ఉద్యోగులు రాజకీయ పార్టీలను దూరం పెట్టడంతో పాటు, మరోవైపు మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలం కావడంతో టీడీపీకి ఆ ఆశ కూడా చచ్చిపోయింది. దీంతో జిల్లాల విభజనని రచ్చ చేయాలని చూస్తోంది.

అటు బాలకృష్ణ హిందూపురం కోసం ఫైట్ చేస్తున్నారు, ఇటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సమస్యలను టీడీపీ హైలెట్ చేస్తోంది. అయితే దీనిపై వచ్చే మైలేజీ తమకు ఉపయోగపడదనే అనుమానం కూడా టీడీపీలో ఉంది. అందుకే చాలామంది లోకల్ సమస్యలపై దృష్టిపెడుతున్నారు. ఎవరి సొంత లాభం కోసం వారు పాకులాడుతున్నారు.

అమరావతిపై కూడా టీడీపీ ప్రస్తుతానికి నిరాశలోనే ఉంది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ వ్యూహం అర్థం కాకపోవడంతో న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్లిన రైతులు, తిరిగి గమ్యస్థానం చేరుకున్నారు. 

రైతు పేరుతో ఉద్యమం చేసిన టీడీపీ సానుభూతిపరులు ఇప్పుడు గోళ్లు గిల్లుకుంటున్నారు. ఇలా ప్రతి సమస్య కూడా టీడీపీకి నోటిదాకా వచ్చి చెడిపోతోంది. అందుకే ఆ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. నేతలంతా చెల్లాచెదురయ్యారు. విడివిడి సమస్యలపై ఉమ్మడి పోరాటం అంటూ కాలక్షేపం చేస్తున్నారు.