మెట్రో అందరికీ అందరికీ తెలిసింది ఒక్కటే. కానీ కేరళలో వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే ఇది తొలి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందింది. ఇంతకీ వాటర్ మెట్రో అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి?
కేరళలోని బ్యాక్ వాటర్స్ ను మరింత సద్వినియోగం చేసుకునేందుకు వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. ట్రాక్ పై మెట్రో రైళ్లు, రోడ్లపై సిటీ బస్సులు ఎలా తిరుగుతాయో.. నీటిలో నడిచే బోట్లు ఈ వాటర్ మెట్రో. కేరళలోని కొచ్చిలో పురుడు పోసుకున్న ఈ వాటర్ మెట్రో, ఈరోజు ప్రారంభమౌతుంది. రేపట్నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
కొచ్చి వాటర్ మెట్రో, జర్మనీకి చెందిన కే ఎఫ్ డబ్ల్యూ సంస్థలు కలిసి ఈ వాటర్ మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 1137 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం 78 ఎలక్టిక్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
కొచ్చితో పాటు చుట్టుపక్కలున్న 10 చిన్న దీవుల్ని కలుపుతూ ఈ వాటర్ మెట్రోను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా హైకోర్ట్ టెర్మినల్ నుంచి వైపిన్ టెర్మినల్ కు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు ఉండవు. పైగా అందమైన ప్రకృతిని చూస్తే ప్రయాణం చేసే అనుభూతి కలుగుతుంది.
వాటర్ మెట్రో కోసం జర్మన్ టెక్నాలజీతో తయారైన అత్యాధునిక బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి లీథియం టెటైనైట్ స్పిన్నెల్ బ్యాటరీస్ సహాయంతో నడుస్తాయి. ఈ బోట్లు అన్నీ పర్యావరణానికి అనుకూలమైనవి. అంతేకాదు, వికలాంగులు కూడా ప్రయాణించడానికి అనుకూలంగా ఈ బోట్లను, టెర్మినల్స్ ను తయారుచేశారు.
ప్రస్తుతానికి ఉదయం 8 గంటల నుంచి ఈ సర్వీసులు ప్రారంభించి, రాత్రి 10 గంటల వరకు తిప్పుతారు. రద్దీని బట్టి ప్రతి 15 నిమిషాలకు ఓ మెట్రో బోట్ ను ఏర్పాటుచేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. రోజూవారీ ప్రయాణం చేసేవారి కోసం వీక్లీ, మంత్లీ పాస్ లు కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఇప్పటికే టూరిజంలో ముందుంది కేరళ. ఈ వాటర్ మెట్రోతో తమ రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది.