ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెళుతున్నారు. ఈ సందర్భంగా కొత్తగా టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణలో టెన్షన్ నెలకుంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి టీడీపీలో చేరికకు ముందు చంద్రబాబునాయుడితో ఒక అవగాహనకు వచ్చినట్టు ప్రచారం జరిగింది. సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నట్టు బాబు చెవిలో వేశారు. ఒకవేళ ఏదైనా కారణంతో సత్తెనపల్లి సీటు ఇవ్వడం కుదరకుంటే పెదకూరపాడు టికెట్ ఇవ్వాలని షరతు విధించారు.
సత్తెనపల్లి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. 26వ తేదీ చంద్రబాబు సత్తెనపల్లి పర్యటనలో అభ్యర్థిపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సత్తెనపల్లిలో టీడీపీ వర్గాలుగా విడిపోయింది. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ కృష్ణ, అలాగే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు శ్రీనివాస్ అదే సీటును ఆశిస్తున్నారు. సత్తెనపల్లిలో కోడెల, రాయపాటి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయపాటి శ్రీనివాస్, కోడెల శివరామ్ కొట్టుకు చస్తుంటే, మధ్యలో తానున్నానంటూ కన్నా దూరారు. దీంతో అక్కడ టీడీపీ టికెట్ వ్యవహారం మూడు ముక్కలాటను తలపిస్తోంది. మరోవైపు వైసీపీలో అసమ్మతిని సొమ్ము చేసుకోవాలంటే కన్నా లక్ష్మీనారాయణే సరైన అభ్యర్థిగా చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది.
తాజా పర్యటనలో కన్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గంలో అంబటి కంటే కన్నాకే మంచి పలుకుబడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
సత్తెనపల్లి టికెట్ ఇవ్వకపోతే రాజకీయంగా తమ కుటుంబానికి ముగింపు పలికినట్టు అవుతుందని కోడెల కుమారుడు గగ్గోలు పెడుతున్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ సమావేశాల్లో కనీసం తన తండ్రికి నివాళి కూడా అర్పించడం లేదని ఆయన బహిరంగంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి, పెదకూరపాడు టికెట్ల వ్యవహారంలో చంద్రబాబు మనసులో ఏముందనే ఉత్కంఠకు తెరలేచింది.