ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న కుమార్తె, సోదరి డాక్టర్ నర్రెడ్డి సునీత రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఈ మేరకు సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పోస్టర్లు గోడలపై కనిపించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. డాక్టర్ సునీత టీడీపీలో చేరినట్టుగా ఆ పార్టీ నేతలతో ఆమె ఫొటో వుండడం గమనార్హం.
జై తెలుగుదేశం నినాదంతో పోస్టర్లున్నాయి. ఈ పోస్టర్లలో సునీతతో పాటు ఆమె తండ్రి వివేకానందరెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. అలాగే వీరితో పాటు చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, లోకేశ్, కడప జిల్లా టీడీపీ నేతలు ఆర్.శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి ఉండడం గమనార్హం.
రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం అని ఆహ్వానం పలుకుతూ ప్రొద్దు టూరులో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇంతకూ ఈ పోస్టర్లను ఎవరు వేశారో తెలియడం లేదు. కానీ వివేకా హత్యానంతరం దోషులను సమాజం ముందు నిలబెట్టేందుకు పోరాడుతున్న ధీర వనితగా టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
కడప జిల్లాలో వైఎస్ సునీత టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తుందని కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సునీతకు ఆహ్వానం పలుకుతూ టీడీపీ తరపున పోస్టర్లు కనిపించడం వెనుక ఎవరి ప్రమేయం వుందో అనే చర్చ జరుగుతోంది.
టీడీపీ, వైసీపీలో ఇది ఎవరి మైండ్ గేమ్ అనే చర్చకు తెరలేచింది. టీడీపీలో సునీత చేరుతున్నారనే ప్రచారంతో తాము కొంత కాలంగా ఆమెపై చేస్తున్న ఆరోపణలు నిజమే అని నమ్మించేందుకు వైసీపీ కుట్ర అయి వుండొచ్చని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు తాము చెప్పిందే నిజమవుతోందని, సునీత టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని వైసీపీ వేగవంతం చేస్తోంది. ఈ పోస్టర్లలో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే…సునీతను వైఎస్ కుటుంబ సభ్యురాలిగా పోకస్ చేయడం. మొత్తానికి సునీత కేంద్రంగా కడప జిల్లా రాజకీయం హీటెక్కుతోంది.