వైఎస్ కుటుంబంలో ఒకే రోజు ఇద్ద‌రి బెయిల్‌పై….!

వైఎస్ పేరుతో పే…ద్ద కుటుంబ‌మే వుంది. ఈ ఇంటి పేరును వాడుకుని చాలా మంది అనేక ర‌కాలుగా ల‌బ్ధి పొందారు, పొందుతున్నారు. ఈ ఇంటి పేరు పుణ్య‌మా అని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి క్రేజ్ వ‌చ్చింది. తండ్రి…

వైఎస్ పేరుతో పే…ద్ద కుటుంబ‌మే వుంది. ఈ ఇంటి పేరును వాడుకుని చాలా మంది అనేక ర‌కాలుగా ల‌బ్ధి పొందారు, పొందుతున్నారు. ఈ ఇంటి పేరు పుణ్య‌మా అని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి క్రేజ్ వ‌చ్చింది. తండ్రి పేరుతో పాటు తాను కృషి చేయ‌డంతో ప్ర‌జాద‌ర‌ణ పొందారు. అయితే వైఎస్ పేరు కొంత‌కాలంగా మ‌స‌క‌బారుతోంది. దీనికి ఆయ‌న కుటుంబ స‌భ్యులే కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. దీన్ని వైఎస్ అభిమానులు, అనుచ‌రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

తాజాగా వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఇద్ద‌రు నేత‌లు ఒకే రోజు బెయిల్‌కు సంబంధించి విచార‌ణ ఎదుర్కోనున్నారు. వైఎస్ కుమార్తె ష‌ర్మిల‌, అలాగే సోద‌రుడి కుమారుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ కోసం న్యాయ‌పోరాటం చేస్తున్నారు. వైఎస్ కుమార్తె ష‌ర్మిల నాంప‌ల్లి కోర్టులోనూ, అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులోనూ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.

పోలీసుల‌పై చేయి చేసుకోవ‌డంపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ష‌ర్మిల‌పై కేసు న‌మోదైంది. ఆమెను అరెస్ట్ చేసి నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా 14 రోజుల రిమాండ్‌కు న్యాయ‌మూర్తి ఆదేశించారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆమెను చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డే అన్నారు. ఇవాళ నాంప‌ల్లి కోర్టులో ష‌ర్మిల బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌రి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

వివేకా హ‌త్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిపై సీబీఐ అరెస్ట్ క‌త్తి వేలాడదీసింది. అరెస్ట్ కాకుండా అవినాష్‌రెడ్డి అలుపెర‌గ‌ని న్యాయ‌పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు అవినాష్ ప్ర‌య‌త్నాలను  అడ్డుకునేందుకు వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత శ‌క్తివంచ‌న లేకుండా న్యాయ పోరాటం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో బెయిల్ సంగ‌తిని తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీంతో ఇవాళ తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెల‌కుంది. హైకోర్టులో సానుకూల తీర్పు రాక‌పోతే, ఇక అరెస్ట్ త‌ప్ప‌ద‌ని వైసీపీ శ్రేణులు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యాయి. అక్కాత‌మ్ముడికి సంబంధించి బెయిల్ పిటిష‌న్ల‌పై వేర్వేరు న్యాయ‌స్థానాలు ఎలాంటి తీర్పు ఇస్తాయో చూడాలి.