ఉద్యోగుల‌కు జ‌గ‌న్ భారీ న‌జ‌రానా…ఎప్పుడంటే!

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. త‌మ ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టు ఫిట్మెంట్ లేక‌పోవ‌డంతో స‌హ‌జంగానే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే అడ‌క్కుండానే ఐఆర్ 27 శాతం…

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. త‌మ ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టు ఫిట్మెంట్ లేక‌పోవ‌డంతో స‌హ‌జంగానే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే అడ‌క్కుండానే ఐఆర్ 27 శాతం ఇచ్చారు. దీంతో పీఆర్సీ అంత‌కంటే ఎక్కువే ఉంటుంద‌ని అంద‌రూ ఆశించారు. ఉద్యోగుల ఆశ‌ల‌కు, కోరిక‌ల‌కు భిన్నంగా పీఆర్సీ 23 శాతానికి ప‌డిపోవ‌డంతో మండిప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌ట్ట‌డం, ఈ నెల 6వ తేదీ అర్థ‌రాత్రి నుంచి స‌మ్మె బాట ప‌ట్టేందుకు ప్ర‌భుత్వానికి నోటీసు కూడా ఇవ్వ‌డం తెలిసిందే. ఈ మ‌ధ్య‌లో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌ల‌తో ప్ర‌భుత్వం నియ‌మించిన మంత్రుల క‌మిటీ రెండు మూడు ద‌ఫాలుగా నిర్వ‌హించిన చ‌ర్చలు స‌ఫ‌ల‌మ‌య్యాయి. త‌మ డిమాండ్ల విష‌యంలో ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింద‌ని, ఇందుకు సీఎం జ‌గ‌న్‌కు పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు నేరుగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో సీఎం కీల‌క అంశాలు చెప్పారు. పరిస్థితులు బాగుంటే మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినన్నారు. ఈ ప్రభుత్వం మీదే అన్నారు. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్న‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో సీఎం చెప్పారు. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల …మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చ‌న్నారు.  

సీఎంతో స‌మావేశం త‌ర్వాత పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కులు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాల్లో ప్రాధాన్యం ఉంది. రానున్న రోజుల్లో ప‌రిస్థితులు కుదుట ప‌డి, ఆర్థికంగా రాష్ట్రం మెరుగుప‌డితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉద్యోగుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని సీఎం చెప్పిన‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌లు తెలిపారు. అయితే ఆ విష‌యాన్ని చెప్ప‌కుండానే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేయాల‌నే ఆలోచ‌న‌ను త‌మ ముందు సీఎం వ్య‌క్త‌ప‌రిచార‌ని తెలిపారు.

సీఎంతో పాటు ఉద్యోగ సంఘాల నేత‌ల మాట‌ల్ని బ‌ట్టి ఓ విష‌యం అర్థ‌మ‌వుతోంది. 2023 మార్చి త‌ర్వాత ఉద్యోగుల‌కు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించి మ‌రోసారి వారి ప్రేమాభిమానాల‌ను పొందేందుకు సీఎం జ‌గ‌న్ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ మేర‌కు ఉద్యోగుల‌కు భ‌విష్య‌త్‌లో ప్ర‌త్యేకంగా ఆర్థికంగా మ‌రింత చేయూత‌నిచ్చేందుకు ఇప్ప‌టి నుంచి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సంబంధిత ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. 

సెకెండ్ గ్రేడ్ టీచ‌ర్ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం ద్వారా వారి అభిమానాన్ని త‌ప్ప‌క పొందుతార‌ని ఉద్యోగులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఊహించ‌ని విధంగా ఆర్థిక చేయూత‌ను జగ‌న్ ఇస్తార‌నే న‌మ్మ‌కం మాత్రం ఉద్యోగ సంఘాల నేత‌ల్లో క‌నిపిస్తోంది. సీఎం ఇచ్చిన ఆ భ‌రోసాతోనే కొన్ని అంశాల్లో ప‌ట్టింపుల‌కు వెళ్ల‌కుండా స‌మ్మె విరమించిన‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌లు చెబుతున్నారు.