స్వాములు మా పార్టీ కాదంటున్న మంత్రి గారు

అంతా అయిపోయాక తాపీగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విపక్షాన్ని ఎల్లో మీడియాను ఘాటుగా విమర్శించేశారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. బ్రహ్మాండంగా సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరిగితే ఒక సెక్షన్ ఆఫ్…

అంతా అయిపోయాక తాపీగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విపక్షాన్ని ఎల్లో మీడియాను ఘాటుగా విమర్శించేశారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. బ్రహ్మాండంగా సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరిగితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బురద జల్లిందని ఆయన వాపోయారు. సామాన్య భక్తులకే పెద్ద పీట వేసి తాము చందనోత్సవాన్ని ఘనంగా చేశామని అన్నారు.

ఎలాంటి అపచారాలు పొరపాట్లు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. స్వాములు తమ పార్టీ అని విపక్షాలు ప్రచారం చేయడం దారుణం అన్నారు. అసలు స్వాములు రాజకీయాలకు అతీతంగా ఉంటారని, వారిని తెచ్చి తమ పార్టీ అనడమేంటి అని మంత్రి గారు మండిపడ్డారు. స్వరూపానందేంద్ర స్వామీజీ తమ ప్రభుత్వాన్ని విమర్శించలేదని ఆయన అంటున్నారు.

రెండు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారంటే చందనోత్సవం విజయవంతం కాదా అని ఆయన ప్రశ్నించారు. కొన్ని వాహనాలు రిపేర్లు కావడం వల్లనే కొండకెళ్ళే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడిందని, అలాగే అంచనాలకు మించి భక్తులు రావడం వల్ల కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయని అన్నారు. దాని మీద జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో  ఒక కమిటీని నియమించి విచారణ జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు.

తొందరలో సింహాచలానికి పర్మనెంట్ ఈవోను నియమిస్తామని హామీ ఇచ్చారు. పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లితే చూస్తూ ఊరుకోమని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి అన్నీ చెప్పారు మళ్ళీ విచారణ జరిపిస్తామని అంటేనే తప్పు ఒప్పుకున్నట్లుగా విపక్షాలు నిలదీస్తున్నాయి. 

స్వాములు తమ పార్టీ కారని చెబుతున్నా మంత్రులు పెద్దలు వారి వద్దకే వెళ్ళి ఎందుకు దండాలు పెడుతున్నారని అడుగుతున్నారు. స్వరూపానందేంద్ర స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేయగానే తమ పార్టీ కాదని అంటారా అని ఎకసెక్కం చేస్తున్నారు.