సీనియర్ నేతను కోల్పోయిన టీఆర్ఎస్

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుతెచ్చుకున్న నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు నోముల.…

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుతెచ్చుకున్న నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు నోముల. ఆయన వయసు 64 సంవత్సరాలు.

కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు నోముల. ఈ క్రమంలో రాత్రి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు. జాయిన్ అయిన కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు నోముల. సీపీఎం తరఫున పొలిటికల్ ఎంట్రి ఇచ్చిన నోముల, నకిరేకల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన శైలి ప్రసంగాలతో ప్రజల్ని బాగా ఆకట్టుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరి గులాబీ కండువ కప్పుకున్నారు.

అయితే విభజన వెంటనే జరిగిన ఎన్నికల్లో నోముల ఓడిపోయారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తిరిగి 2018లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

నోముల ఆకస్మిక మరణం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నోముల మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నోముల నిలిచిపోతారని అన్నారు.