అక్ర‌మ మైనింగ్.. జేసీల‌కు షాకింగ్ ఫైన్!

సిమెంట్ ఫ్యాక్ట‌రీకి అంటూ ప‌ర్మిష‌న్ల‌ను తీసుకుని.. ఆ భూముల నుంచి విలువైన స్టోన్ ను మైనింగ్ చేసి.. అమ్ముకున్న వ్య‌వ‌హారంలో అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుటుంబానికి అత్యంత భారీ ఫైన్…

సిమెంట్ ఫ్యాక్ట‌రీకి అంటూ ప‌ర్మిష‌న్ల‌ను తీసుకుని.. ఆ భూముల నుంచి విలువైన స్టోన్ ను మైనింగ్ చేసి.. అమ్ముకున్న వ్య‌వ‌హారంలో అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుటుంబానికి అత్యంత భారీ ఫైన్ ప‌డింది. అక్ర‌మ మైనింగ్ పై అధికారులు స్పందిస్తూ.. ఏకంగా వంద కోట్ల రూపాయల జ‌రిమానాను విధించిన‌ట్టుగా తెలుస్తోంది. 

త్రిశూల్ పేరుతో సిమెంట్ ఫ్యాక్ట‌రీకి ప‌ర్మిష‌న్ల‌ను తీసుకుంది జేసీ కుటుంబం. వాస్త‌వానికి ఆ ప‌ర్మిష‌న్ల‌ను వాళ్లింట్లో ప‌ని చేసే డ్రైవ‌ర్లు, ప‌ని వాళ్ల పేర్ల‌తో మొద‌ట తీసుకున్నార‌ట‌. ఆ త‌ర్వాత వాటిని జేసీ కుటుంబీకుల పేర్ల మీద‌కు బ‌ద‌లాయించుకున్నారు. అలా ప‌ర్మిష‌న్ తీసుకున్న చోట ఫ్యాక్ట‌రీని క‌ట్ట‌లేదు. ఈ అంశంపై ఏడాది కింద‌ట కోర్టు స్పందిస్తూ.. ఆ వ్య‌వ‌హారంపై చ‌ర్య‌లేం తీసుకున్నారంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. దీంతో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్పందించింది.

ఫ్యాక్ట‌రీకి అంటూ ప‌ర్మిష‌న్ తీసుకున్న చోట జేసీ ఫ్యామిలీ మైనింగ్ చేసింద‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అక్క‌డ లైమ్ స్టోన్ ను త‌వ్వి తీసి జేసీ కుటుంబీకులు అమ్ముకుని కోట్ల రూపాయ‌ల‌ను గ‌డించిన‌ట్టుగా అధికారులు నిర్ధారించారు. ప్ర‌భుత్వ భూములు తీసుకుని, ప‌ర్మిష‌న్ మేర‌కు ఫ్యాక్ట‌రీ క‌ట్ట‌కుండా, అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డిన వ్య‌వ‌హారంలో భారీగా ఫైన్ విధించారు అధికారులు. ఆ మొత్తం వంద కోట్ల రూపాయ‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

చ‌ట్ట ప్ర‌కార‌మే ఈ జ‌రిమానా విధించిన‌ట్టుగా, ఒక వేళ ఈ మొత్తాన్ని చెల్లించ‌క‌పోతే జేసీ కుటుంబీకుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయ‌డానికి కూడా అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంటున్నారు. మొత్తం 14 ల‌క్ష‌ల టన్నుల లైమ్ స్టోన్ ను అక్ర‌మంగా త‌వ్వి తీశార‌ని.. దీని విలువ అతి భారీగా ఉంటుంద‌ని అధికారులు నిర్ధారించారు. 

మ‌రి ఈ వంద కోట్ల రూపాయ‌ల జ‌రిమానాను జేసీ కుటుంబీకులు క‌డ‌తారా?  లేక కోర్టుల‌కు వెళ్తారా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. కానీ గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే..ఈ  అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ మొద‌లైన‌దే కోర్టు ఆదేశాల మేర‌కు! జేసీ కుటుంబీకుల అక్ర‌మ మైనింగ్ పై కొంత‌మంది ముందుగా కోర్టుకు వెళ్లారు. అది టీడీపీ హ‌యాంలోనే జ‌రిగింది. ఆ పిటిష‌న్ల‌పై విచార‌ణ చేస్తూ ఏడాది కింద‌టే కోర్టు ప్ర‌భుత్వాన్ని చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. మ‌రి ఇప్పుడు జ‌రిమానా ప‌డింది. దానిపై కోర్టుకు వెళ్లే అవ‌కాశాలు ఎంత వ‌ర‌కూ ఉంటాయో తేలాల్సి ఉంది.

అయితే జేసీ ఫ్యామిలీ అక్ర‌మ మైనింగ్ ఇదొక్క‌టే కాద‌ని, వేరే మైనింగ్ ప‌ర్మిట్ల‌లోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌నే వార్త‌లు ఇది వ‌ర‌కే వ‌చ్చాయి. మైనింగ్ చేసే ఏ ఒక్క‌రూ ప‌ద్ధ‌తి ప్ర‌కారం త‌వ్వ‌లేరు అని జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. త‌ద్వారా వేరే ప‌ర్మిట్ల‌లో కూడా అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆయ‌న ఒప్పుకున్నారు!

అయినా గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి మైనింగ్ అక్ర‌మాల‌పై పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ! ఆ అక్ర‌మాల‌పై ఏకంగా సినిమాల‌ను స్పాన్స‌ర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ! మ‌రి అలాంటి పార్టీలోని నేత‌లు అటు ప్ర‌కాశం జిల్లా నుంచి ఇటు అనంత‌పురం వ‌ర‌కూ మైనింగ్ గ‌డ్డ‌ల‌పై గ‌ద్ధ‌ల్లా వ్య‌వ‌హారించి, తాము దోచేసిన వైనాన్ని బ‌హిరంగంగా ఒప్పుకుంటున్నారు! మ‌ళ్లీ ఆ పార్టీ అధినేతేమో ప్ర‌తి రోజూ శుద్ధులు చెబుతూ ఉంటారు!