మొద‌లైన గ్రేట‌ర్ పోలింగ్..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. అటు తెలంగాణ రాష్ట్ర స‌మితి, ఇటు భార‌తీయ జ‌న‌తా పార్టీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి బ్యాలెట్ పేప‌ర్ల మీద…

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. అటు తెలంగాణ రాష్ట్ర స‌మితి, ఇటు భార‌తీయ జ‌న‌తా పార్టీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి బ్యాలెట్ పేప‌ర్ల మీద పోలింగ్ జ‌రుగుతూ ఉంది. తెలుపు రంగు బ్యాలెట్ పేప‌ర్లు గులాబీ, కాషాయ పార్టీల భ‌విత‌వ్యాన్ని నిర్దేశించ‌బోతున్నాయి. 

ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా పోటీలో ఉన్నా.. వాటి ప్ర‌భావం ప్ర‌చార స‌మ‌యంలోనే చాలా త‌క్కువ‌గా క‌నిపించింది. ప్ర‌త్యేకించి క్రితం సారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఓట్ల లెక్క ప్ర‌కారం మూడో స్థానంలో నిలిచిన టీడీపీ అన్ని డివిజ‌న్ల‌లో నామినేష‌న్ల‌ను కూడా వేయించుకోలేక‌పోయింది. వంద డివిజ‌న్ల వ‌ర‌కూ ఆ పార్టీ పోటీలో నిలిచినా.. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కానీ ఆయ‌న త‌న‌యుడు కానీ ప్ర‌చారానికి వెళ్ల‌క‌పోవ‌డంతో టీడీపీ పోటీలో ఉన్నా లేన‌ట్టుగా ఉంది.

తెలంగాణ రాష్ట్ర స‌మితికి గ్రేట‌ర్ పీఠాన్ని మెరుగైన డివిజ‌న్ల‌లో ఆధిక్యంతో సొంతం చేసుకోవ‌డం పెద్ద ప‌రీక్ష‌గా మారుతోంది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న స‌ర్వ శ‌క్తులూ ఒడ్డి ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ద‌గ్గ‌ర నుంచి ప‌క్క రాష్ట్రాల గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కూ అంతా వ‌చ్చి గ్రేట‌ర్ లో ప్ర‌చారం చేశారు. ఎంఐఎంను బూచిగా చూపిస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ తన ప్ర‌చార హోరు సాగించింది. పాత‌బ‌స్తీ మాత్ర‌మే ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ అజెండా అయ్యింది. 

ఈ క్ర‌మంలో గ్రేట‌ర్ ఓట‌ర్ ఎటు వైపు మొగ్గు చూపుతాడ‌నేది అత్యంత ఆస‌క్తిదాయ‌కంగా మారింది. క్రితం సారి జీహెచ్ఎంసీ పోల్స్ లో 45 శాతం ఓటింగ్ న‌మోదైంది. మ‌రి క‌రోనా ఫియ‌ర్స్ తో ఈ సారి ఎంత ఓటింగ్ ‌న‌మోద‌వుతుంది? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. బ్యాలెట్ పేప‌ర్ల మీద ఓటింగ్ కావ‌డంతో పోలింగ్ ప్ర‌క్రియ కూడా కాస్త నిదానంగానే సాగే అవ‌కాశం ఉంది. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌తోనే పోలింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ఈసీ ప్ర‌క‌టించింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను పోలింగ్ ప్ర‌క్రియ‌లో భాగం చేసింది.

ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి త‌దిత‌రులు త‌మ ఓటు హ‌క్కున్న బూతుల ప‌రిధిలో ఓటేశారు.