నటీమణి వహీదా రెహమాన్‌కు దాదా ఫాల్కే ఎవార్డు (2021) ప్రకటించడం హర్షించాల్సిన విషయమే. సెప్టెంబరు 26, దేవ్ ఆనంద్ శతజయంతి రోజున యీ ప్రకటన వెలువడడం విశేషం. ఇప్పుడావిడకు 85 ఏళ్లు. తెలుగు సినిమాల ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసినా, అతి త్వరలోనే హిందీ సినిమాల్లోకి వెళ్లిపోయి జాతీయ స్థాయి నటీమణి అయిపోయారు. ఆణిముత్యా లనదగిన అనేక హిందీ సినిమాల్లో ఆమె కథానాయిక. అవి అంత బాగా తయారు కావడానికి, కమ్మర్షియల్‌గా హిట్ కావడానికి ఆమె వంతు కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆమె అందగత్తె. మంచి నర్తకి. తెరపై అన్ని రకాల రసాలూ అభినయించింది. అల్లరి పిల్ల పాత్రతో సహా ఏ పాత్ర ధరించినా కొట్టవచ్చినట్లు కనబడేది – ఆమె హుందాతనం! నిజజీవితంలో కూడా ఆవిడ హుందాగానే ప్రవర్తిస్తుంది. ఎక్కడా ఎవరితో వివాదాలు తెచ్చుకోలేదు.
ఆవిడ జీవితం గురించి పత్రికల్లో చదివే ఉంటారు. అందుకని క్లుప్తంగానే చెప్తాను. 85 ఏళ్ల క్రితం 1938లో పుట్టింది. ఆవిడ తండ్రిది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చెంగల్పట్టు ప్రాంతం. మునిసిపల్ కమిషనర్‌గా చాలా ఊళ్లలో పని చేశారు. వహీదాకు పదేళ్ల వయసుండగా ఆయనకు వైజాగ్‌కు బదిలీ అయింది. అక్కడే చదువుకుంటూ ఆమె భరతనాట్యం నేర్చింది. అంతకుముందే మద్రాసులో తర్ఫీదైంది. అప్పుడప్పుడు నాట్యప్రదర్శనలు యిచ్చేది. ఆమెకు 13 ఏళ్లుండగా తండ్రి పోయాడు. పైన ముగ్గురు అక్కలున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో ఎమ్జీయార్ ‘‘ఆలీబాబావుమ్ 40 తిరుడర్‌గళుమ్’’ (1956) సినిమాలో నాట్యానికి ఒప్పుకుంది. ‘‘రోజులు మారాయి’’ (1955)లో ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’ పాటకు నృత్యం చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదల కాకుండానే ఎన్టీయార్ తను తీస్తున్న ‘‘జయసింహ’’ (1955)లో సెకండ్ హీరోయిన్ పాత్ర, చిన్నదే అనుకోండి, యిచ్చారు. ఆమెకు షావుకారు జానకి డబ్బింగు చెప్పారు.
‘‘మిస్సమ్మ’’ను హిందీలో తీసే ఉద్దేశంలో సినిమా చూడడానికి హైదరాబాదు వచ్చిన గురుదత్ ‘‘రోజులు మారాయి’’ పాటకై వహీదాకు వచ్చిన గుర్తింపు చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే బొంబాయి పిలిపించి తన అసిస్టెంటు రాజ్ ఖోస్లా దర్శకత్వంలో తను నిర్మిస్తున్న ‘‘సిఐడి’’ (1956) సినిమాలో హీరో దేవ్ ఆనంద్ పక్కన చివర్లో మంచిగా మారే వ్యాంప్ వంటి పెద్ద పాత్ర యిచ్చాడు. వహీదా వెనకాడలేదు. ఆ ధైర్యమే కెరియర్ మొత్తంలో ఆమె కనబర్చింది. అప్పట్లో హీరోయిన్లందరూ అయితే అందాల బొమ్మలుగా లేకపోతే శోకమూర్తులుగా నటించేవారు. కానీ వహీదా భిన్నమైన పాత్రలు వేసింది. తెలుగులో రెండో సినిమాకే హీరోయిన్ అయిపోయిన తీరుగా హిందీలో కూడా గురుదత్ దర్శకనిర్మాతగా, హీరోగా తీసిన ‘‘ప్యాసా’’ (1957)లో హీరోయిన్ అయిపోయింది. దానిలో ఆమెది హీరో అంటే ఆరాధన పెంచుకున్న వేశ్య పాత్ర. ‘‘సిఐడి’’లాగానే ‘‘ప్యాసా’’ కూడా సూపర్ హిట్. దానికి తోడు ‘‘ప్యాసా’’ క్లాసిక్‌గా నిలిచింది. వహీదా అభినయానికి అందరూ వహ్వా అన్నారు.
గురుదత్, దేవ్ యిద్దరూ వహీదా నటనకు ఫిదా అయిపోయారు. 1958లో ఆమెవి రెండు చిత్రాలు విడుదలైతే ‘‘ట్వెల్వో క్లాక్’’లో హీరో గురుదత్, ‘‘సోల్వా సాల్’’లో హీరో దేవ్. ‘‘సోల్వా సాల్’’లో మర్నాటి పెళ్లిచూపులకై పెళ్లికొడుకు వస్తున్నాడనగా ముందు రోజు రాత్రి ప్రియుడితో చెక్కేసే అమ్మాయి పాత్ర వేసింది. 1959లో వచ్చిన ‘‘కాగజ్ కే ఫూల్’’లో వివాహితుడైన దర్శకుడితో ప్రేమలో పడిన సినిమా తార పాత్ర. 1960లో వచ్చిన ‘‘కాలా బజార్’’లో ఒకతన్ని ప్రేమించి, అతను విదేశాలకు వెళ్లినపుడు హీరోపై అభిమానాన్ని పెంచుకునే పాత్ర. 1962లో సత్యజిత్ రాయ్ దర్శకత్వంలో చేసిన బెంగాలీ సినిమా ‘‘అభిజా(యా)న్’’లో ఆమెది ఒక వితంతువు పాత్ర. ఒక టాక్సీ డ్రైవరుతో శారీరక సంబంధం పెట్టుకుంటుంది.
1963లో వచ్చిన ‘‘ముఝే జీనే దో’’ లో ఆమెది పెళ్లిళ్లలో డాన్సు చేసే నర్తకి పాత్ర. ఒక బందిపోటు ఆమెను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. 1965 నాటి ‘‘గైడ్’’లో ఆమె పాత్ర ఆర్కియాలజిస్టు అయిన భర్తను అసహ్యించుకుని, ఒక గైడ్‌తో ప్రేమలో పడి, అతని కోసం భర్తను విడిచి పెట్టే పాత్ర. 1966 నాటి ‘‘తీస్రీ కసమ్’’లో ఆమెది గ్రామగ్రామాన తిరిగే నౌటంకీలో డాన్సులు చేసే పాత్ర. ఆమె కన్య అనుకుని పొరబడి ప్రేమించిన అమాయకపు బండివాడిని యిష్టపడి కూడా అతన్ని వంచించడం యిష్టం లేక అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. 1969నాటి ‘‘ఖామోశీ’’లో ఆమె ఒక పిచ్చాసుపత్రిలో నర్సు. ప్రేమ విఫలం కావడంతో మతి పోగొట్టుకున్న పేషంటుకు చికిత్సలో భాగంగా ప్రేమ నటిస్తుంది. ఆ క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది. కానీ చిత్తస్వాస్థత చేకూరగానే అతను యీమెను మర్చిపోయి వెళ్లిపోతాడు. మరొక విఫల ప్రేమికుడితో కూడా యిదే ప్రయోగం చేయమంటాడు డాక్టరు. రెండో అతను యీమెతో నిజంగానే ప్రేమలో పడతాడు. కానీ యీమె మొదటివాణ్ని మరవలేక, యితన్ని కాదనలేక ఆ ఘర్షణలో స్వయంగా మతిభ్రష్టురాలవుతుంది.
ఈనాటి హీరోయిన్లు కూడా వేయడానికి తటపటాయించే పాత్రలు వహీదా 60 ఏళ్ల క్రితమే వేసిందని మనకు అర్థమౌతుంది. ఇలాటి ఆఫ్‌బీట్ పాత్రలు వేయడానికి జయా బాధురి, షబానా అజ్మి, స్మితా పాటిల్ వంటి నాన్-గ్లామరస్ నటీమణులే సిద్ధపడతారు. కానీ వహీదా గ్లేమరస్, కమ్మర్షియల్ తారామణి. అయినా యిలాటి సాహసాలు చేసింది. ‘‘చౌదహ్‌వీ కా చాంద్’’ (1960)లో హీరోయిన్గా ఎంతో గ్లామర్ కనబరచి, సినిమా సూపర్ హిట్ కావడానికి దోహదపడిన ఆమె గురుదత్ తర్వాతి చిత్రం ‘‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’’ (1962)లో సెకండ్ హీరోయిన్ పాత్ర వేయడానికి ఏ మాత్రం జంకలేదు. ఆ సినిమాలో ఫోకస్ అంతా మీనా కుమారి మీదే. కానీ ఆమెది విషాద పాత్ర. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి చిలిపి పిల్ల పాత్రను వహీదాకు యిచ్చారు. ‘‘నీల్ కమల్’’ (1968)లో వేసేనాటికి ఆమెకు 30 ఏళ్లు. ఎంత గ్లామరస్‌గా కనబడుతుందో చెప్పనలవి కాదు. వివిధ నృత్యరీతుల్లో ఆమె నైపుణ్యం తెలియాలంటే ‘‘గైడ్’’, ‘‘తీస్రీ కసమ్’’ చూసి తీరాలి.
ఏ సినిమాలో నైనా సరే, ఆమె పాత్ర వేసిందంటే అభినయానికి చాలా స్కోప్ ఉంటుంది. జస్ట్ గ్లామర్ డాల్ పాత్రలు వేయలేదు. విషాదం ఒలికించినపుడు కూడా గాంభీర్యం కనబడేది. దీనురాలిగా తోచేదే కాదు. గురుదత్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, రాజ్ కుమార్, సునీల్ దత్, సౌమిత్ర చటర్జీ, రాజేశ్ ఖన్నా వంటి దిగ్గజాల సరసన కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 35 ఏళ్లు దాటాక హీరోయిన్ పాత్రలు రావడం మానేశాక ఆమె ‘‘ఫాగున్’’ (1973) సినిమాలో జయ బాధురి తల్లిగా ఒక క్లిష్టమైన పాత్ర ధరించింది. పంజాబీ, ఉర్దూ రచయిత రాజేందర్ సింగ్ బేదీ రచించి, దర్శకత్వం వహించిన ఆ సినిమా ఒక సైకలాజికల్ డ్రామా లాటిది.
డబ్బున్న కుటుంబానికి చెందిన వహీదా తలిదండ్రుల యిష్టానికి వ్యతిరేకంగా పేద రచయిత ఐన ధర్మేంద్రను పెళ్లాడుతుంది. హోలీ రోజున అతను సరదాగా రంగు చల్లితే ‘నా సిల్క్ చీర పాడై పోయింది చూడు, యిలాటిది నువ్వు కొనివ్వగలవా?’ అంటుంది కోపాన్ని నటిస్తూ, పక్కన ఉన్న తలిదండ్రులకు తృప్తి కలిగించాలని. కానీ ధర్మేంద్ర తీవ్రంగా హర్ట్ అవుతాడు. అప్పటికప్పుడు యిల్లు విడిచి వెళ్లిపోతాడు. దాంతో వహీదా, కూతురు జయ బాధురిని ఒంటరిగా పెంచి ఒక డాక్టరు (విజయ్ అరోడా)కు యిచ్చి పెళ్లి చేస్తుంది. కూతురు కూడా తన లాగే మూర్ఖంగా ప్రవర్తించి భర్త మనసు కష్ట పెట్టి, దూరం చేసుకోకూడదనే ఆతృతతో వాళ్ల చిలిపి కజ్జాలలో కూడా కలగ చేసుకుని, హితవు చెప్తూ న్యూసెన్స్‌గా తయారవుతుంది. కూతురు అలిగినపుడు అల్లుణ్ని ఎక్కువగా పేంపర్ చేసి, అపోహలకు చోటిస్తుంది. కూతురు, అల్లుడు ఆమెను పంపించి వేస్తే తప్ప సంసారం సాగదని అనుకుంటారు.
వహీదా తన ఒంటరితనమే యీ చికాకులకు కారణమని బాధపడుతూ, భర్తను వెతకడానికి నిశ్చయించుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి భర్త సిల్కు చీర పట్టుకుని తిరిగి వస్తాడు. వహీదా కన్నీరుమున్నీరై అతన్ని అక్కున చేర్చుకుంటుంది. తల్లీకూతుళ్ల మధ్య యీ మానసిక ఘర్షణను బేదీ ఎంత బాగా రాశారో, వహీదా, జయా యిద్దరూ పోటీపడి అభినయించారు. ఆ తర్వాత వహీదా వేసిన పాత్రలు ఉన్నాయి కానీ అవి సహాయ పాత్రలే. తొలుతగా ఆమె తమిళ సినిమాలో నర్తించింది. ఒక బెంగాలీ సినిమాలో నటించింది. తెలుగులో ‘‘రోజులు మారాయి’’, ‘‘జయసింహ’’, ‘‘బంగారు కలలు’’, ‘‘సింహాసనం’’ సినిమాల్లో వేసింది. ‘‘గైడ్’’ ఇంగ్లీషు వెర్షన్లో కూడా వేసింది. ఆమెకు ఉత్తమ నటిగా 2 ఫిల్మ్‌ఫేర్ ఎవార్డులు (‘‘గైడ్’’, ‘‘నీల్ కమల్’’) జాతీయ ఎవార్డు (‘‘రేశ్మా ఔర్ షెహరా’’) వచ్చాయి. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, యిప్పుడు యీ దాదాసాహెబ్ ఎవార్డు వచ్చాయి.
నేను వహీదా గురించి 2014లో యీ కాలమ్‌లోనే ఓ రెండు టిడ్‌బిట్స్ రాశాను. అవి చదవని వారి కోసం యిప్పుడు రిపీట్ చేస్తున్నాను. ఓ సారి మద్రాసు ఎయిర్‌పోర్టులో అన్నపూర్ణా నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి వహీదా ఎదురైంది. ఆమె 1951లో తెనాలిలో డాన్సు పోగ్రాం యిచ్చిన రోజులనుండి యీయనకు తెలుసు. ‘పెళ్లి చేసుకోబోతున్నానండి’’ అందామె. ‘శుభం, పెళ్లి చేసుకోబోయే ముందు ఓ తెలుగు సినిమాలో నటించ కూడదా?’’ అన్నారీయన. ‘’మీరు తీస్తానంటే నేను వేయనంటానా?’’ అందామె సమాధానంగా. యద్దనపూడి సులోచనారాణి రాసిన ఓ సీరియల్ ఆధారంగా ‘’బంగారు కలలు’’ (1974) సినిమా తీస్తూ మధుసూదనరావుగారు నాగేశ్వరరావు పక్కన హీరోయిన్ వేషం ఆఫర్ చేశారు వహీదాకు. ఆమె సరేనంది. ఆ సినిమాలో ముఖ్యమైన చెల్లెలు పాత్రను లక్ష్మికి యిచ్చారు.
కానీ అదే సమయంలో చలం నిర్మించిన మరో సినిమాలో కూడా లక్ష్మిది యిలాటి పాత్రే! పోలిక వస్తుందని భయపడి, హీరోయిన్గా లక్ష్మిని పెట్టుకుని చెల్లెలు పాత్ర వహీదాను వేయమంటే.. అనుకున్నారు అన్నపూర్ణావారు. అంత పెద్ద స్టార్ దిగివచ్చి వేషం వేస్తానంటే యిలా చెల్లెలు పాత్ర వేయమంటే ఏం బాగుంటుంది? అని జంకారు. ఏమైతే అది అయిందని ఆమెను కలిసి విషయం చెప్పారు. ఆమె కొద్దిసేపు ఆలోచించి ‘’నేను ఆర్టిస్ట్‌ని. చేసేది మంచి పాత్రా? కాదా? అని తప్ప హీరోయిన్‌గానే వేయాలన్న పట్టుదల నాకేమీ లేదు. నేను రెడీ’’ అందామె. ఆమె ఔదార్యం అంతటితో ఆగలేదు. తనతో బాటు మందీమార్బలం ఎవరూ లేకుండా ఓ టచప్ వుమన్ను తెచ్చుకున్నారామె. పాత్రకు కావలసిన కాస్ట్యూమ్స్, మేకప్ మెటీరియల్ బొంబాయినుండి తానే తెచ్చుకున్నారు.
రిట్జ్ హోటల్లో రూము బుక్ చేస్తే ‘’ఎందుకండీ దండగ! నేను కూడా సారథీ స్టూడియోలో వుంటాను’’ అంది. చివరకు ఆమెను ఒప్పించి ‘బ్లూ మూన్’ హోటల్లో బస ఏర్పాటు చేశారు. తెలుగు నటీనటులతో కలిసిపోయి ఏపాటి భేషజం లేకుండా నటించారామె. టి. సుబ్బరామిరెడ్డి ఓ క్లబ్లో చిలిపి కస్టమర్‌గా చిన్న పాత్ర వేస్తూ క్లబ్ డాన్సు చేస్తున్న వహీదా బుగ్గ గిల్లడం ఓ విశేషం! ఆవిడ దానికి అభ్యంతరం చెప్పకపోవడం మరీ విశేషం! ఇక వహీదా కాస్ట్యూమ్స్ గురించి ఎంత పట్టుదలగా ఉండేదో చెప్పే సంఘటన ఒకటి. ‘‘రోజులు మారాయి’’లో డాన్సు చూసి గురుదత్ వహీదాను1955 చివర్లో బొంబాయి పిలిపించారని రాశాను కదా. వహీదా వయసు 18 కంటె తక్కువ కాబట్టి మూడేళ్ల కాంట్రాక్టుపై ఆమె తల్లిని సంతకం చేయమన్నారు. అంతలో వహీదా ‘’నేను ఒక షరతు పెట్టదలచుకున్నాను.’’ అంది. ‘‘సిఐడి’’ సినిమా డైరక్టర్ రాజ్ ఖోస్లా కూడా అక్కడే వున్నాడు. అతను ఆశ్చర్యపడుతూ ‘’కొత్తగా వచ్చినవాళ్లు షరతులు పెట్టరు.’’ అన్నాడు. ‘’ఏదైనా కాస్ట్యూమ్ యిష్టం లేకపోతే నేను వేసుకోను. అది ఒప్పందంలో రాయండి.’’ అంది వహీదా.
గురుదత్ ‘’నేను అలాటి సినిమాలు తీయను. నా సినిమాలేవైనా చూశావా?’’ అని అడిగాడు. ‘’లేదు.’’ అంది వహీదా. ‘’అయితే ఊళ్లో మిస్టర్ అండ్ మిసెస్ 55 ఆడుతోంది. ఇవిగో టిక్కెట్లు వెళ్లి చూసి రండి.’’ అన్నాడు. మర్నాడు ఆఫీసుకి వచ్చి వహీదా ‘’కాస్ట్యూమ్స్‌లో అభ్యంతర పెట్టదగినది ఏదీ లేదు. అయినా నేను చెప్పిన షరతు ఒప్పందంలో పెట్టండి.’’ అంది. రాజ్ ఖోస్లా మండిపడ్డాడు – ‘’కాస్ట్యూమ్ సీనుపై ఆధారపడి వుంటుంది. నటిపై కాదు.’’ అని. వహీదా నెమ్మదిగానే అయినా స్థిరంగా చెప్పింది – ‘’నాకు వయసు వచ్చిన తర్వాత స్విమ్‌సూట్ కూడా వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే నాకు సిగ్గు ఎక్కువ కాబట్టి అలాటి డ్రస్సు వేసుకోను.’’ అని. ‘’అంత సిగ్గయితే సినిమాల్లోకి వేయడానికి ఎందుకు వచ్చావ్?’’ అని వెక్కిరించాడు రాజ్ ఖోస్లా. ‘’నేను రాలేదు. మీరే రప్పించారు.’’ అంది వహీదా. గురుదత్ యీ సంభాషణ అంతా వింటూ కూర్చున్నాడు. ఏమీ పలకలేదు. కానీ వహీదా వెళ్లిపోయాక అగ్రిమెంటు మార్పించి, మర్నాడు వహీదాను రప్పించి సంతకం పెట్టించాడు.
కాస్ట్యూమ్ గురించిన గొడవ వహీదా, రాజ్ ఖోస్లాల మధ్య మళ్లీ వచ్చింది. ‘’సిఐడి’’ సూపర్ హిట్ కావడంతో వహీదా దేవ్ ఆనంద్-గురుదత్లకు చాలా ఆత్మీయురాలైంది. రాజ్ ఖోస్లా దర్శకత్వంలో దేవ్, వహీదాలు హీరోహీరోయిన్లుగా తయారైన ‘’సోల్వా సాల్’’ సినిమాలో ఒక బ్లౌజ్ వేసుకోవడానికి వహీదా అభ్యంతరపెట్టింది. రాజ్ ఖోస్లాకు కోపం వచ్చి షూటింగు ఆపేశాడు. మర్నాడు వేరే బ్లౌజ్‌తో వహీదా నటించింది. కానీ ఆమె మనసులో అతనిపై కోపం పోలేదు. ‘’గైడ్’’ సినిమాను రాజ్ ఖోస్లా దర్శకత్వంలో తీయడానికి దేవ్ ఆనంద్ నిశ్చయించుకుని హీరోయిన్గా చేయమని వహీదాను అడిగితే ‘’అతని డైరక్షన్లో చేయను. మా యిద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోండి.’’ అందిట.
ఈ విషయం నస్రీన్ మునీమ్ కబీర్ రాసిన ‘’కాన్వర్సేషన్స్ విత్ వహీదా రహమాన్’’ పుస్తకంలో లేదు, అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా రాశాను. పుస్తకంలో ఈవిడ చెప్పినదేమిటంటే – ‘నేను అతని పేరుకి అభ్యంతరం చెప్పగానే దేవ్ ఆనంద్ ‘అప్పటికీ యిప్పటికీ రాజ్ చాలా మారాడులే’ అని నచ్చచెప్పాడు కానీ ఎందుకో ఆయనే రాజ్‌ను మార్చేశాడు’ అని. ఆ కథలో హీరోయిన్ నృత్యకళాకారిణి. వహీదా తప్ప వేరేవాళ్లు ఆ పాత్రకు సరిపోరని అనుకున్న దేవ్, వహీదాను ఎంచుకుని రాజ్‌ను తప్పించి అంతిమంగా తన తమ్ముడు విజయ్ ఆనంద్‌కు దర్శకత్వం అప్పగించాడు. ‘’గైడ్’’ కళాత్మక చిత్రంగా, ఆల్‌టైమ్ హిట్‌గా మిగిలింది. బ్లౌజ్ వివాదం కారణంగా దాన్ని దర్శకత్వం చేసే అవకాశాన్ని రాజ్ ఖోస్లా జారవిడుచుకున్నాడు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆమె హిందీ సీమకు వెళ్లిన రోజుల్లోనే తనను నటిగా మలచిన దర్శకనిర్మాత గురుదత్తో ప్రేమలో పడింది. అతను అప్పటికే గాయని గీతా దత్‌ను ప్రేమించి పెళ్లాడి ఉన్నాడు. ఇద్దర్నీ వదులుకోలేని సంకట స్థితి అతనిది. ఆత్మకథా? అనిపించేలా ‘‘కాగజ్ కే ఫూల్’’ సినిమా తీశాడు. అది ఫెయిలైంది. ఆ వైఫల్యానికి కృంగిపోయాడు. తర్వాత సాదిక్ దర్శకత్వంలో తీసిన ‘‘చౌదహ్‌వీ కా చాంద్’’ సక్సెసయి డబ్బులు కురిపించినా డిప్రెషన్ లోంచి బయటకు రాలేదు. మద్యానికి బానిసయ్యాడు. భార్యకు విడాకులిచ్చి నిన్ను చేసుకుంటా అని వహీదాకు మాటిచ్చాడు కానీ గీతాతో కూతుర్ని కన్నాడు. ఇక యితన్ని నమ్ముకుంటే లాభం లేదని, ఒక చక్కటి సంసారాన్ని పాడు చేసిన వ్యక్తిగా తనపై ముద్ర పడుతుందని వహీదాకు అర్థమై పోయింది. గురుదత్ను దూరం పెట్టసాగింది. అతను యీమె సినిమాలు షూటింగు జరిగే చోటికి వచ్చి గొడవ చేయసాగాడు. భరించింది. ఇంతలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది 1964లో జరిగింది. ఆ సమయానికి ఆమె ‘‘షాగున్’’ అనే సినిమాలో కమల్జీత్ (అసలు పేరు శశి రేఖి) అనే హీరో సరసన నటిస్తోంది. ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ (1962)లో తప్ప అతనికి వేరే ఏ సినిమాలోనూ గుర్తింపు రాలేదు. అయినా వహీదా అతనంటె యిష్టపడింది. మరో పదేళ్లకు తన 36వ ఏట అతన్ని పెళ్లాడి, బెంగుళూరులో స్థిరపడింది. వాళ్లకు ఒక కొడుకు, కూతురు కలిగారు. 2000 సం.లో భర్త చనిపోవడంతో ఆమె బొంబాయికి తిరిగి వచ్చేసి అక్కడే ఉంటోంది. తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకోవడానికి ఆమె ఎప్పుడూ యిష్టపడదు. చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తూంటుంది.
ఆమెపై చిత్రీకరించిన కొన్ని పాటల యూట్యూబు లింకులు యిస్తున్నాను. వీలుంటే చూడండి.
‘‘చౌదహ్‌వీ కా చాంద్ హో’’ టైటిల్ సాంగ్,
‘ఏ నయన్ డరేడరే’ (కోహ్రా),
‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై..’ (‘‘గైడ్’’),
‘పాన్ ఖావో సయ్యా హమారో..’ (తీస్రీ కసమ్),
‘భవ్రా బడా నాదాన్ హై’ (సాహెబ్ బీబీ ఔర్ గులామ్).
ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు యివ్వాలని కోరుకుంటున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)